ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి. బిల్లులు ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. ప్రభుత్వం చర్చలకు పిలించిందని ఓ సారి హడావుడి చేసే ప్రయత్నం చేశారు ఆస్పత్రుల యాజమాన్యాలు. మేము చర్చలకే పిలవలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
ఇబ్బంది పడుతున్న పేద రోగులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాని ఆపరేషన్లు, చికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందుబాటులో ఉంటాయి. పేదలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. చాలా మంది చికిత్సను వాయిదా వేసుకుంటున్నారు. లేదా సొంత డబ్బులతో చికిత్స చేయించుకుంటున్నారు. కొంత మంది ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఎలా చూసినా పేద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆస్పత్రులతో చర్చలకు ముందుకు రావడం లేదు.
త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తెస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకువస్తోంది. 5 కోట్ల మందికి రూ. 25 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించనున్నారు. సెప్టెంబర్ 2025లో క్యాబినెట్ అప్రూవల్ పొందిన ఈ పథకం త్వరలో పూర్తిగా అమలులోకి వస్తుంది. కార్డుతో సంబంధం లేకుండా ఏపీలో ఉన్న అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 6 గంటల్లో అప్రూవల్, 2,493 నెట్వర్క్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తారు. ఇది ఇన్సూరెన్స్.. నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆస్పత్రికి చెల్లిస్తాయి.
అప్పటి వరకూ అయినా ప్రైవేటు ఆస్పత్రులను దారిలో ఉంచాల్సింది!
ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేస్తే తమకు ఇవ్వాల్సిన బాకీలను ఇక ప్రభుత్వం ఇవ్వదని ఇప్పుడే.. వసూలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. అందుకే బంద్ ప్రారంభించారు. జగన్ హయాంలో పెట్టిన 2700 కోట్ల బాకీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తంగా మూడు వేల కోట్ల బాకీ ఉందని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. వారికి ఏదో ఒకటి చెప్పి.. బుజ్జగించి.. పరిస్థితిని దారిలోకి తేవాలన్న సూచనలు ప్రభుత్వానికి వస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టనట్లుగా ఉంది.
