అజహరుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తోందని.. శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయిందని తెలియగానే.. బీఆర్ఎస్ పార్టీ ఇతర కాంగ్రెస్ నేతల్ని రేసులోకి తీసుకు వస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆశలు పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు తమకు హైకమాండ్ నుంచి ఇంకా సమాచారం రాలేదని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికీ అవకాశం ఉందని ప్రచారం ప్రారంభించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని చేసిన రచ్చ తర్వాత.. ఆయనకు నిజంగా ఇవ్వాలనుకున్నా ఇవ్వరు. ఇస్తే బెదిరింపులకు లొంగిపోయారని అనుకుంటారు. అలాంటి సంకేతాలు పంపితే మరో పది మంది అదే బెదిరింపులతో బయటకు వస్తాయి. సామాజికవర్గాల కోణం.. జిల్లాల ప్రాతినిధ్యం ప్రకారం చూసినా ఆయనకు అవకాశమే రాదు. అయినా ఆయనను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ అనుకూల మీడియా, సోషల్ మీడియా.
కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. అది రేవంత్ రెడ్డికే అవమానం అవుతుంది. కొద్ది రోజులుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించడం కష్టం. ఆదేశించినా రేవంత్ తీసుకోవడానికి సందేహిస్తారు. ఏ విధంగా చూసినా రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఉండదు. అంతగా రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే. బోగన్ సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తారు.
