అనిల్ అంబానీ ఆర్థికంగా చితికిపోయారు. దాని కారణంగా ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు నిండా మునిగాయి. మన దేశ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఆ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుల్ని అనిల్ అంబానీ దారి మళ్లించారు. రూ.42 వేల కోట్లను అక్రమంగా వాడేశారు. ఆ విషయాన్ని కోబ్రాపోస్టు వెల్లడించింది.
2006 నుంచి అనిల్ అంబానీ పని అదే!
అనిల్ ధీరుభాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ ADA గ్రూప్ ఆరు లిస్టెడ్ కంపెనీలు – రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ – పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి, ఐపీఓలు, బాండ్ల జారీ ద్వారా సేకరించిన మొత్తం రూ.28,874 కోట్లను ప్రమోటర్లతో సంబంధం ఉన్న షెల్ కంపెనీలకు దారి మళ్లించాయి. ఇది మాత్రమే కాదు, సింగపూర్, మారిషస్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అమెరికా, బ్రిటన్‌లలోని విదేశీ షెల్ ఎంటిటీల ద్వారా మరో రూ.13,047 కోట్లను దేశంలోకి తరలించి, అక్కడి నుంచి మళ్లీ గ్రూప్ సంబంధిత సంస్థలకు పంపారు. మొత్తం మీద రూ.41,921 కోట్లకు పైగా నిధులు దారి మళ్లాయని కోబ్రాపోస్టు సంచలన వివరాలు వెల్లడించింది.
పక్కా ప్లాన్ తో మోసం !
ఎస్పీవీలు లేదా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ముందుగా లిస్టెడ్ కంపెనీల నుంచి నిధులను వాటికి బదిలీ చేసేవారు. ఆ తర్వాత ఆ కంపెనీలను మూసేవారు లేదా పేరు మార్చేవారు. ఉదాహరణకు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి రూ.7,965 కోట్లు 49 షెల్ కంపెనీలకు లోన్ల రూపంలో వెళ్లాయి, అక్కడి నుంచి 14 అనిల్ అంబానీ సంబంధిత సంస్థలకు చేరాయి. అదేవిధంగా రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ నుంచి రూ.4,980 కోట్లు 27 షెల్ కంపెనీలకు, రిలయన్స్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ నుంచి రూ.1,400 కోట్లు DHFL, YES బ్యాంక్‌లకు కి లంచాల రూపంలో వెళ్లాయి. విదేశీ మార్గంలో సింగపూర్‌లోని EMITS వంటి ఎంటిటీలు, BVIలో 26 షెల్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని కోబ్రా పోస్టు వెల్లడించింది.
ఆ నిధుల్ని ఏం చేశారు ?
ఆ నిధుల్ని కొన్ని వ్యక్తిగత విలాసాలకు వాడారు. 2008లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిధులతో అనిల్ అంబానీ టీనా అంబానీ పేరిట సుమారు రూ.170 కోట్లు విలువైన ఓ యాచ్ కొనుగోలు చేశారు. మరో రూ.395 కోట్లు హాలీవుడ్లో స్టీవెన్ స్పీల్బర్గ్ డ్రీమ్‌వర్క్స్ స్టూడియోస్‌లో పెట్టుబడిగా పెట్టారు. ఇవన్నీ కంపెనీస్ యాక్ట్, ఫెమా, పీఎంఎల్ఏ, సెబీ రెగ్యులేషన్స్, ఆదాయపు పన్ను చట్టం – ఈ ఐదు ప్రధాన చట్టాలను ఉల్లంఘించినట్టు కోబ్రాపోస్ట్ చెబుతోంది.
2019లో అడాగ్ దివాలా
అనిల్ అంబానీ చేసిన నిర్వాకంతో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఆర్థిక కుప్పగా మారాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2019లో బ్యాంకరప్ట్ అయింది, రిలయన్స్ క్యాపిటల్, హోమ్ ఫైనాన్స్ ఎన్సీఎల్టీలోకి వెళ్లాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రూ.1.78 లక్షల కోట్ల నష్టం, 55 లక్షల మంది చిన్న షేర్హోల్డర్లకు రూ.1.59 లక్షల కోట్లు కోల్పోయారు. ఈ రుణ సంక్షోభం 2017లో మొదలై 2020 నాటికి గ్రూప్‌ను దాదాపు నిర్వీర్యం చేసింది. ఇప్పటికీ ఈడీ, సీబీఐ దర్యాప్తులు కొనసాగుతున్నాయి . YES బ్యాంక్, DHFL లోన్ మోసాల్లో అనిల్ అంబానీ పేరు ఉంది.
తోసిపుచ్చిన అడాగ్
రిలయన్స్ ADA గ్రూప్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. పాత డాక్యుమెంట్లను తప్పుగా అర్థం చేసుకుని, సందర్భం లేకుండా చూపించారని వాదించింది. తమ కంపెనీ షేర్లను తగ్గించాలని ప్రయత్నమని చెబుతోంది. సెబీకి ఫిర్యాదు చేసి, షేర్ ట్రేడింగ్‌పై పరిశీలన కోరింది. రిపోర్ట్‌లోని ప్రతి ఆరోపణా కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, సెబీ, ఎన్సీఎల్టీ, ఆర్బీఐ, విదేశీ నియంత్రణ సంస్థల ఫైలింగ్‌లు, ఆర్డర్లపై ఆధారితమని కోబ్రా పోస్టు చెప్పింది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                