బాహుబలి 1 వచ్చి పదేళ్లయ్యింది. బాహుబలి 2కి ఏడేళ్ల వయసు. ఈ ఫ్రాంచైజీ చేసిన అద్భుతాలు, ఇచ్చిన బూస్టప్ మాటల్లో చెప్పలేం. బాహుబలి ప్రభావం ఇప్పటికీ టాలీవుడ్ పై ఉంది. ఈ సినిమాపై మనకు ప్రేమ చావలేదు. అందుకు నిదర్శనం బాహుబలి ఎపిక్. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు, కురిపిస్తున్న ఆదరణ చూస్తుంటే మతి పోతోంది. ఇప్పుడే ఈ సినిమా వచ్చినట్టు, ఈరోజే.. ఈ అద్భుతాన్ని కళ్లారా చూస్తున్నట్టు ఊగిపోతున్నారు అభిమానులు. సోషల్ మీడియా తెరిస్తే.. బాహుబలి ముచ్చట్లే. జస్ట్ రెండు భాగాల్ని కలిపి.. ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారంతే. అటూ ఇటుగా 4 గంటల సినిమా. ఇప్పటికే వెండి తెరపై చూసేశాం. టీవీల్లో చూసేశాం. ఓటీటీల్లో చూసేశాం. అయినా సరే.. ఈ సినిమాపై ప్రేమ చావలేదు. రీ రిలీజ్ లో రూ.100 కోట్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డులు సృష్టించడానికి బాహుబలి ఎపిక్ పరవళ్లు తొక్కుతోంది.
బాహుబలి 3 తీస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. బాహుబలి లో ఎన్నో పాత్రలు.. ఇంకెన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కో పాత్రతో ఒక్క సినిమా చేయొచ్చు. శివగామి పాత్ర చుట్టూ ఓ పుస్తకమే వచ్చింది. కట్టప్ప కథ కూడా ఓ సినిమాగా రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, రానాలు ఉన్నా లేకున్నా.. మిగిలిన పాత్రలతో చాలా కథలు చెప్పొచ్చు. అందుకు ఇదే సరైన సమయం. ఇప్పటికే కట్టప్ప పాత్రతో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బాహుబలి టీమ్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి డీల్ చేయకపోవొచ్చు. ఆయన శిష్యగణంలో ఒకరు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. అలానే శివగామి పాత్ర కూడానూ. యానిమేషన్ లో ఈ కథలు చెప్పినా చూడ్డానికి బాగుంటాయి. పైగా ప్రస్తుతం యానిమేషన్ యుగం నడుస్తోంది. కాబట్టి బాహుబలికి సంబంధించిన ఫ్రాంచైజీ ప్రకటిస్తే అందుకు ఇదే సరైన తరుణం. బాహుబలి ఎపిక్ ఇస్తున్న కిక్ లోనే రాజమౌళి బృందం ఆ ప్రకటనేదో చేసేస్తే బాహుబలి అభిమానుల ఆనందం పరిపూర్ణం అవుతుంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                