మంత్రి పదవులు ఇవ్వలేకపోయినందున సీనియర్లు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలకు కీలక పదవులను ఇచ్చింది హైకమాండ్. సీనియర్ నేత, మంత్రి పదవి ఏ కోణంలో చూసినా ఖాయమనుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి ఇవ్వలేకపోయారు. అయితే ఆయనకు న్యాయం చేయాలని.. ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అది కూడా పూర్తి స్థాయి కేబినెట్ హోదాతో.. ఆరు గ్యారంటీల అమలు చూస్తారు. అన్ని శాఖలపైనా ఆయనకు అధికారం ఉంటుంది. అంటే మంత్రి కంటే పవర్ ఫుల్ అనుకోవచ్చు.
ఈ పదవితో ఆయన సంతృప్తి పడతారో లేదో కానీ అవకాశం లేని చోట.. ఓ పదవి సృష్టించి ఆయనకు న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం గట్టిగా పోటీ పడిన ప్రేమ్ సాగర్ రావుకు కూడా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా కేబినెట్ హోదాతో పదవి ఇచ్చారు. న్యాయంగా అయితే ఆయనకూ పదవి దక్కాలి. కానీ వివేక్ కు ఇవ్వడంతో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఓ రకంగా సీనియర్లు అందరికీ న్యాయం చేసినట్లు అయింది.
ఒక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే మిగిలిపోయారు. ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే తనకు చాన్స్ వస్తుందని ఆయన సరి పెట్టుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాజకీయ లెక్కలను చూస్తే.. అలాంటి అవకాశం లేదని అనుకోవచ్చు. ఆ రెండు పదవులు మళ్లీ ఏదైనా అవసరం వస్తే తప్ప భర్తీ చేయరు. మార్పు చేర్పులు కూడా ఇప్పుడల్లా చేసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. కేబినెట్ హోదాతో ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని అనుకున్నా.. ఆయన చేసిన అతి .. చేసిన విమర్శల కారణంగా ఇవ్వడం కష్టంగా మారింది.
