జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం అదీ కూడా.. 55 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని కేకే సర్వేస్.. కేకే తేల్చేశారు. ఆయన ఈ మేరకు తన సర్వే డీటైల్స్ తో ఓ వీడియో విడుదల చేశారు. గతంలోఆయన చేసిన సర్వేలు చాలా వరకూ కరెక్ట్ అయ్యాయి. కానీ హర్యానాలో మాత్రం పూర్తి రివర్స్ అయ్యాయి. అయన సర్వేలు తప్పుగా తేలిన సందర్భాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మిగతా వాటి సంగతి ఏమో కానీ.. జూబ్లిహిల్స్ ఫలితం విషయంలో మాత్రం తన విశ్వసనీయతను .. ఇంత కాలం పెంచుకున్న నమ్మకన్ని పణంగా పెట్టేశారని అనుకోవచ్చు.
జూబ్లిహిల్స్ డివిజన్లలో కేకే చెప్పిన లెక్కలు అసాధారణం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్లలో .. నాలుగు చోట్ల అరవైశాతానికిపైగా బీఆర్ఎస్ కు ఓటు వేస్తారని కేకే సర్వేస్ తేల్చింది. బోరబండ, ఎర్రగడ్డ,షేక్ పేట, శ్రీనగర్ కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ అరవై శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పడం చిన్న విషయం కాదు. ఇదేమీ గ్రేటర్ ఎన్నిక కాదు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకూ ఇతర పార్టీల్లో చేరిపోయింది. సిటీ పరిధిలో ఇంత ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుందని ఎవరూ అనుకోరు. కానీ కేకే సర్వే తాము ఎంతో పరిశోధన చేసి అదే నిజమని తేల్చారు.
హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో కేకే తప్పుడు సర్వేలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేకే చేసిన సర్వే ఘోర తప్పిదంగా మారింది. కాంగ్రెస్కు 75 సీట్లు వస్తాయని తేలిస్తే.. చివరికి 11 సీట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు ఇలాంటి సర్వేను ప్రకటిస్తే ఆయన బీఆర్ఎస్ అమ్ముడుపోయారని ఇతరులు అంటారు. అదే అంటున్నారు. ఆయన సర్వేలన్నీ లాటరీలని అంటున్నారు. ఇప్పుడు కేకే కూడా తన సర్వేలు నిజమని నమ్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాటరీ వేస్తే ఎప్పుడూ సక్సెస్ రాదు. జూబ్లిహిల్స్ లో ఫలితం తేడా వస్తే కేకే తన నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నట్లుగా అవుతుంది.
ఫీల్జ్ లోకి వెళ్లని సర్వేయర్లది లాటరీస్ !
దేశంలో సర్వేలు చేసే సంస్థల్లో యాక్సిస్ మై ఇండియాకు చాలా పేరు ఉంది. ఆ సంస్థకు విస్తృతమైన నెట్ వర్క్ ఉంది. అలాంటిది వారు చేసే సర్వేల్లోనే తప్పులు దొర్లుతూ ఉంటాయి. కేకే దానికి అతీతం కాదు. ఎందుకంటే ఆయన ఫీల్డులో సర్వేలు చేస్తారా లేకపోతే.. మీడియాలో వచ్చే వార్తల్ని బట్టి అనాలసిస్ చేసుకుంటారా అన్నది ఎవరికీ తెలియదు. ఫీల్డ్ సర్వేలు చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. ఆఫీసులో గ్రాఫిక్స్ చేసుకోవాలంటే సింపుల్ గా అయిపోతుంది. కేకే .. ఏ పని చేస్తున్నారో ఎన్నికల ఫలితాల సమయంలో తేలుతుంది. ఫలితం తేడా వస్తే.. కేకే కూడా.. మరో ఆరా మస్తాన్ లా మిగిలిపోతారు.
