సోషల్ మీడియా యుగంలో ఫేక్ .. డీప్ ఫేక్ ప్రతి ఒక్కరికి పెను సమస్యగా మారింది. ఏఐ విరివిగా అందుబాటులోకి వచ్చేశాకా క్రియేటివిటీకి అంతులేకుండా పోతుంది. ఆ క్రియేటివిటీ ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి.. వాడుతూండటమే ప్రమాదకరంగా మారింది. ఫేక్ న్యూస్ కోసం.. ఫేక్ ఫోటోలు, వీడియోలు కూడా తయారు చేస్తున్నారు. తమకు నచ్చని వారిని ఇబ్బంది పెట్టడానికి తెగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇక సహించకూడదని కేసు పెట్టారు. ఇప్పుడు దాంతో ఆ విషయం మరోసారి చర్చనీయాంశమయింది.
రాజకీయ పార్టీలు, తప్పుడు ఫ్యాన్స్ వల్ల సోషల్ మీడియా కలుషితం
సోషల్ మీడియా యువతను ప్రభావితం చేస్తుందని తెలిసిన తరవాత వారిని తప్పుదోవ పట్టించడానికి రాక్షస మూకలు రంగంలోకి దిగాయి. సోషల్ మీడియా సైకోలుగా వీరు తయారయ్యారు. రాజకీయ పార్టీలు లేదా సినీ హీరోల ఫ్యాన్స్ ఫండింగ్ తో ఒక్కొక్కరు వికృతం చూపించడం ప్రారంభించారు. తమ అభిమాన హీరోను అభిమానించడం వరకూ ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇతర హీరోల్ని ఎందుకు టార్గెట్ చేయడం. రాజకీయ పార్టీలు కూడా అంతే తమను తాము గొప్పగా చిత్రీకరించకుంటే.. అభ్యంతరం ఉండదు. కానీ ఫేకులతో ఇతర పార్టీల నేతల్ని కించ పర్చడమే రాజకీయం అన్నట్లుగా మార్చారు.
తమ అభిమాన నేత, హీరో ప్రత్యర్థులని టార్గెట్ చేయడం అభిమానమా?
నువ్ ఓ హీరోని లేదా రాజకీయ నాయకుడ్ని అభిమానిస్తే అతన్ని పొగుడుకుంటే తప్పు లేదు. కానీ అతని ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడటం.. మార్ఫింగ్ ఫోటోలు చేయడం .. అభిమానం చూపించడం కాదు. అది సైకో తనం. ఆ హీరో నీకు ఇష్టం లేకపోతే ఆయన సినిమాలు చూడ మాకు. అసలు హీరో ఫోటోనే చూడమాకు సరిపోతుంది. కానీ మీ అభిమాన హీరోకి పోటీగా ఉన్నాడని బూతులు తిట్టండి మాత్రం అభిమానం కాదు. ఇలాంటి మనస్థత్వం ఉన్న వారిని వదిలి పెట్టకూడదు. చిరంజీవిని దారుణంగా కించ పరిచిన వ్యక్తి టైమ్ లైన్ చూస్తే అలాంటి వారికి సోషల్ మీడియా సైకో అనే బిరుదు సరిపోతుంది. వారికి ఇవ్వాల్సిన విధంగా ట్రీట్ మెంట్ ఇస్తేనే దారిలోకి వస్తారు.
ఫేక్ చేసే వాళ్ల మనస్థత్వాలు పూర్తి స్థాయి క్రిమినల్ బ్రెయిన్సే
నిజం తెలిసి కూడా అబద్దం ప్రచారం చేయాలనుకోవడం.. కచ్చితంగా సైకోతనమే అవుతుంది. అది కూడా బూతులు రూపంలో దాన్ని నిజం చేయాలనుకోవడం అత్యంత దారుణమైన విషయం.. ఇలాంటి వారికి కఠిన చర్యలు అంటే ఏమిటో చూపించాల్సి ఉంది. లేకపోతే లేరు వాళ్ల ఆనకొండలుగా మారుతారు. ఇలాంటి వారిని ఎవరూ సపోర్టు చేయకూడదు. ఏ హీరో అభిమానిని అని చెప్పుకుని ఈ రచ్చ చేస్తున్నారో ఆ హీరో అభిమానులు కూడా సమర్థించకూడదు. ఏమీ కాదని వారికి ధైర్యం వస్తే.. రేపు ఆ వికృతం సోషల్ మీడియా అంతా వ్యాపింపచేస్తారు. పోలీస్లు అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భం ఇదే.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              