రవితేజ మాస్ జాతర సినిమా గట్టి దెబ్బ కొట్టేసింది. ప్రీమియర్ షోలతోనే సినిమా జాతకం తేలిపోయింది. ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలు ప్రేక్షకులను విసిగించాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ బ్యానర్లో వచ్చే ప్రతి సినిమాకి త్రివిక్రమ్ సలహాలు, సూచనలు ఉంటాయి. ఆయన నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా, కథ వింటారు. తనకు తోచిన మార్పులు చెబుతారు. సినిమా పూర్తయ్యాక చూస్తారు, ఏవైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచిస్తారు.
‘మాస్ జాతర’ విషయంలో కూడా త్రివిక్రమ్ కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సముద్రఖని పాత్రను చేర్చడం ఆయన ఆలోచనట. అలాగే శ్రీనివాస్ రెడ్డి, సత్యలతో కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుందని కూడా ఆయన సూచించారట. ఆ సూచన మేరకు డైరెక్టర్ ఒక కామెడీ ట్రాక్ షూట్ చేశారు. కానీ సినిమాకి ఉన్న లెంగ్త్ కారణంగా ఆ ట్రాక్ కుదరలేదు. సముద్రఖని పాత్రకు సరైన ముగింపు లేకపోవడం కూడా ఒక లోపంగా మారింది. దీనికి కారణం ఆ పాత్ర మూలకథలో లేకపోవడమే.
ఒరిజినల్ కథలో ఏదైనా నావల్ట్ వుంటే మార్పులు చేర్పులు వర్క్ అవుతాయి. అసలు కథనే రొటీన్ గా వుంటే ఎన్ని హంగులు చేసినా ప్రయోజనం వుండదు. మొత్తానికి సితార ఎంటర్టైన్మెంట్స్కి ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చే ప్రాజెక్ట్‌గా మారింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు ₹25 నుంచి 30 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని టాక్.
