సీనియర్ హీరో మంచు మోహన్‌బాబు ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీకి చేరువయ్యారు. ఆయన చిత్రసీమలోకి అడుగు పెట్టి ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ నెల 22న ‘ఎంబీ50’ పేరుతో హైదరాబాద్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈవెంట్ నిర్వహణ బాధ్యతను మంచు విష్ణు తీసుకున్నారు. ఆయన చాలా ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరౌతారు. చిరంజీవి, రజనీకాంత్ కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉంది.
మోహన్‌బాబు కుటుంబానికి ఇది ప్రత్యేకమైన సందర్భం. అయితే ఈ వేడుకలో మనోజ్ పాల్గొంటాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మంచు ఫ్యామిలీలో మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. మనోజ్, విష్ణు మధ్య ఏవో కలహాలు. మోహన్‌బాబు, విష్ణు పక్షాన ఉంటారు. మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు.
మనోజ్ చాలా వేదికలపై తండ్రి, అన్న గురించి ఇంకా గొప్పగానే మాట్లాడుతుంటాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఇప్పుడు ఈవెంట్ పనులు కూడా స్వయంగా విష్ణునే చూసుకుంటున్నాడు. నిజానికి కుటుంబాలు కలవడానికి ఇలాంటి వేడుకలు మంచి అవకాశాలు. మనోజ్ కూడా ఫ్యామిలీతో కలవాలనే ఆసక్తి చూపిస్తున్నాడు. కూర్చుని మాట్లాడుకుందామని చాలాసార్లు కోరాడు. మరి గోల్డెన్ జూబ్లీ వేడుకలోనైనా అందరూ ఒకే వేదికపై కనిపిస్తారేమో చూడాలి.
