తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని ప్రజలకు చెప్పేందుకు వింత వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు తాము సిఫారసు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కావాలని గవర్నర్ కు లేఖ పంపినా స్పందన లేదంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే.. .బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లేనని.. త్వరలో ఆ రెండు పార్టీలు విలీనం అవుతాయని అంటున్నారు.
కానీ రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడానికి బాగానే ఉంటాయి కానీ.. అవన్నీ ఆయన వైఫల్యాలే అనుకోవాలి. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు. స్పీకర్ కు సమాచారం ఇస్తే చాలు. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు ఊరట లభించలేదు. అయినా అరెస్టు చేయడానికి మాత్రం రేవంత్ సర్కార్ తొందరపడలేదు. కేటీఆర్ అదే పనిగా రెచ్చగొట్టినా.. సానుభూతి కోసం అలా చెబుతున్నారని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు.
కాళేశ్వరం రిపోర్టును సీబీఐకి ఇవ్వడం అంటే.. బీజేపీ చేతుల్లో పెట్టడమే. ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం పై విచారణ చేయిస్తామని డబ్బులన్నీ కక్కిస్తామని ప్రచారం చేశారు. తీరా చర్యలు తీసుకోకుండా.. ఆ నివేదికను సీబీఐ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు సీబీఐ స్పందించడం లేదు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమీ ఉండదు. తమ ఆయుధాన్ని బీజేపీకి ఇచ్చి.. ఇప్పుడు వారిద్దరూ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తే ప్రజలు నమ్మేస్తారా?
