తమ అవకాశవాదాన్ని ప్రధాన పార్టీల చేతకాని తనాన్ని మజ్లిస్ పార్టీ చాలా సులువుగా ప్రజల ముందు ఉంచుతోంది. అక్బరుద్దీన్ ఓవైసీ తాజాగా చేసిన ప్రకటన దీనికి సంకేతం. రెడ్డి లేదా రావు ఎవరు ఉన్నా.. వారికి తాము అనుచరులం కాదని.. హైదరాబాద్ పై పెత్తనం మాత్రం తమదేనని అక్బరుద్దీన్ చెబుతున్న వీడియో వైరల్ గా మారింది.
మజ్లిస్ నేతలు అర్థరాత్రి తర్వాతే ఏదైనా మీటింగ్ లు పెడతారు. అలా పెట్టిన ఓ కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని మజ్లిస్ నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలోఉంటే ఆ పార్టీకి మద్దతిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. తమ జోలికి రాకుండా.. అధికారంలో ఉన్నపార్టీతో టై అప్ అయిపోయి.. లోపాయికారీ రాజకీయాలు చేసి మజ్లిస్ బ్రదర్స్.. మాదే హైదరాబాద్ అని గప్పాలు కొట్టుకుంటున్నారు.
అటు బీఆర్ఎస్ అయినా.. ఇటు కాంగ్రెస్ అయినా.. తాము మజ్లిస్ జోలోకి వెళ్లకుండా.. పాతబస్తీలో అడుగు పెట్టకుండా ఒప్పందం చేసుకుని.. ఇతర చోట్ల మాత్రం మజ్లిస్ మద్దతును పొందుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తమ అవకాశవాదాన్ని ఇలా ఇతర పార్టీల మీద పెత్తనంగా మజ్లిస్ బ్రదర్స్ చెప్పుకోవడం వారికే చెల్లుతుంది.