పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేస్తున్నారు. పాలన ఎలా ఉండాలో సలహాలిస్తున్నారు. పార్టీని ఎలా నడపాలో సూక్తులు చెబుతున్నారు. చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీలు పాటించాలో కూడా చెబుతున్నారు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ దానికి వీరి సలహాలు ప్రవచనాల్లా దూసుకొచ్చేస్తున్నాయి. సరే అది వారి ఆత్రం అనుకుందాం..కానీ వాటిని పాటించడం లేదని .. ప్రభుత్వంపైన, పార్టీపైన, పార్టీ అధినేతపైనా నిందలు వేసేస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇదంతా టీడీపీలో ఇప్పుడు ఓ బ్యాచ్ చేస్తుంది. అ బ్యాచ్ ఎవరంటే.. “ తామే గెలిపించామని” మనుసు నిండా పెట్టుకున్న అతి బ్యాచ్.
మేమే గెలిపించామని అనుకునే అతి బ్యాచ్ తయారు
తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కారణం. చంద్రబాబు నాయకత్వంలో.. లోకేష్ మార్గదర్శకత్వంలో కింది స్థాయి పార్టీ కార్యకర్త నుంచి పై స్థాయి వరకూ అందరూ కష్టపడ్డారు. ఎవరి స్థాయిలో వారు విజయం కోసం కష్టపడ్డారు. క్రెడిట్ అందరికీ వస్తుంది. కానీ కొంత మంది తాము పడిన కష్టం ఎవరూ పడలేదని అనుకుంటారు. తమ వల్ల పార్టీ గెలిచిందని గట్టిగా అనుకుంటారు. అలా అనుకుని అంచనాలు పెంచేసుకుంటారు. తమకు ప్రోటోకాల్ ఉండాలి.. అత్యున్నత గౌరవం దక్కాలని .. తమ సలహాలను తూచ తప్పకుండా పాటించాలని అనుకుంటారు. అలా లేకపోతే అంతే.. వీరిలో విద్వేషం అంతా బయటకు వస్తుంది. ఇలాంటి వారు ఇప్పుడు టీడీపీకి సమస్యగా మారారు.
సలహాలతో కుళ్లబొడుస్తున్న సానుభూతిపరుడు
టీడీపీని నేనే గెలిపించినట్లుగా చెప్పుకునే ఓ ప్రవచనకారుడు.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అదే పనిగా వ్యతిరేకంగా ప్రభుత్వానికి, పార్టీకి, చంద్రబాబుకు కూడా వ్యతిరేకంగా రాసేస్తున్నారు. ఆయన సమస్యేమిటో కానీ.. పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టించాలో కూడా ఆయనే చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే అన్నీ పెడుతున్నారని.. కోస్తా ఏం కావాలని .. అక్కడ మూడో పార్టీ దృష్టి పెట్టాలని సలహాలిచ్చే స్థాయికి వెళ్లిపోయారు. ఆయన ఉద్దేశం జనసేన పార్టీకి సలహా ఇవ్వడమే. అదొక్కటే కాదు.. ప్రభుత్వానికి రేటింగులు ఇచ్చేశారు.. జగన్ తో పోలిక పెట్టి మరీ. అంతేనా.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్న వైనాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఈ అతి రాను రాను అసహ్యంగా మారుతోంది.
మరో ఇద్దరు, ముగ్గురిది అదే బాట
ఈ ఒక్క ప్రవచనకారుడు మాత్రమే కాదు.. ఓ మాజీ ఐపీఎస్, మరో మోతుబరి కూడా ఇదే పని చేస్తూంటారు. వారి ఎజెండా ఏమిటో స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. వీరందరికీ ప్రాధాన్యం దక్కడం లేదనో… ఆశించిన విధంగా నెత్తిన పెట్టుకోలేదనో అసంతృప్తి ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు. కానీ లాజిక్ లేకుండా.. తప్పులేకుండా విమర్శించడమే రాజకీయం. సానుభూతిపరుల ముసుగులో ఇలా చేయడం ఇంకా దారుణం. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంపిక చేసుకుంటాయి. డేటా సెంటర్ అమరావతిలో ఎలా పెట్టగలరు?. జగన్ హయాంలో జరిగిన ఘోరాలు, అవినీతి వీరికి మాత్రమే తెలుసా?. అన్నీ పద్దతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. అధికారం వచ్చిందికదా అని అందర్నీ లోపలేస్తే ఆ కేసులు నిలబడవు.. ప్రభుత్వానికి చెడ్డపేరు. ప్రభుత్వం పద్దతిగా ఒక్కొక్కటిగా తీసుకుంటున్న చర్యలతో.. వైసీపీ నేతలకు సానుభూతి అనేది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సలహాదారులు అలా కాదు.. మొత్తంగా అందర్నీ మూసేయాలంటారు.
వీళ్లదో ప్రత్యేక ఎజెండా !
వీళ్లందరికీ ఓ ప్రత్యేక అజెండా ఉంది. ఓ ఎమ్మెల్యే వీరిని సపోర్టు చేస్తాడని పార్టీలో అందరికీ తెలుసు. గతంలో టిడిపి లో చక్రం తిప్పి ఇపుడు వేరే పార్టీ లో ఉన్న నేత
వీళ్లను ఎందుకు పోషిస్తున్నాడు.. ఎందుకు ఇలా సలహాలతో దాడులు చేయిస్తున్నాడన్నది కూడా అందరికీ తెలుసు. పై స్థాయిలో ఉన్న వారికి తెలియకుండా ఉంటుందా ?.
వీళ్లను అలా వదిలేయడమే బెటర్ !
టీడీపీకి కోట్ల మంది సైనికులు ఉన్నారు. తాము కష్టపడి పని చేశామని అనుకుంటారు. వీరిలో 90 శాతం మంది ఏ ప్రతిఫలం ఆశించరు. కనీసం సలహాలు కూడా ఇవ్వాలనుకోరు. ఎందుకంటే చంద్రబాబుకు, లోకేష్ కు అన్నీ తెలుసని వీరు నమ్ముతారు. వారు చూపించిన బాటలోనే వెళ్తారు. మిగతా పది శాతం మందిలో 9.5శాతం మంది తమ అభిప్రాయాలు అంతర్గతగా చెప్పినా.. ఫైనల్ గా చంద్రబాబు,లోకేష్ ఏది చెబితే అది ఫాలో అయిపోతారు. కానీ తామే గెలిపించామని నిండా భావించేవారు మాత్రం తాము చెప్పిందే చేయాలని.. లేకపోతే డిజప్పాయింటెడ్ ని డ్యామేజ్ చేస్తూంటారు. వీరు చేసిన సాయం పిసరంత అయితే… చేసే డ్యామేజ్ బండంత. వీళ్ల మనస్థత్వాలను బట్టి వీళ్లను బుజ్జగించడం కూడా పెద్ద సమస్యే. ఎందుకంటే ఏదైనా సర్ది చెప్పాలనుకుంటే.. తమ రాతలకు.. అసంతృప్తికి కాళ్ల బేరానికి వచ్చారనుకుని మరింత రెచ్చిపోతారు.
