గ్రామ సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్ గా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి పాలనా వ్యవస్థలో అవి ఆరో వేలు లాంటివి. పంచాయతీల అధికారాలను, విధులను లాగేసుకుని వాటిని జగన్ ఏర్పాటు చేశారు. వీటి కారణంగా పాలనలో గందరగోళం ఏర్పడింది. వీటి ఏర్పాటు రాజ్యాంగబద్ధం కాదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ వాటిని సమర్థించుకునేందుకు అడ్డగోలు వాదనలు జగన్ ప్రభుత్వం వినిపించింది. టీడీపీ ప్రభుత్ం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు చేసే పనుల్ని రివ్యూ చేస్తే.. ఉద్యోగుల్లో పది శాతం మందికి సరైన విధులు లేవని స్పష్టత వచ్చింది. అందుకే సంస్కరించాలని ప్రయత్నిస్తున్నారు.
పేరే కాదు విధులు కూడా మార్పు !
విజన్ యూనిట్స్ గా గ్రామ సచివాలయాలను మారుస్తున్న ప్రభుత్వం అందులో పని చేసే వారి విధుల్ని కూడా సమగ్రంగా సంస్కరించనుంది. ఇతర శాఖల్లో పని చేస్తున్న వారిని ఆయా శాఖలకు ఎటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో పదమాూడు శాఖలకు చెందిన వారిని అక్కడ కూర్చోబెట్టేవారు. సమస్యలు వచ్చినప్పుడు ఇతర శాఖలతో పాటు వీరు కూడా పని చేయాలి. చివరికి మహిళా పోలీసుల్ని కూడా పెట్టారు. వారు నియామకం చెల్లుబాటు కాదని తెలిసి కూడా నియమించారు. పోలీసుల నియామకానికి ప్రత్యేక పద్దతులు ఉంటాయి. ఇలాంటి గందరగోళం మధ్య గ్రామ సచివాలయాలను సంస్కరిస్తున్నారు.
వాట్సాప్ లోనే ఇప్పుడు అన్ని సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చే సేవలన్నీ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లోనే లభిస్తున్నాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అందుకే వారికి లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఆ సచివాలయాలను తీసేస్తే.. ఉద్యోగులు రోడ్డున పడతారన్న ఉద్దేశంతో ఆలోచించారు. వారందర్నీ ఎక్కడో చోట సర్దుబాటు చేసి సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఉద్యోగుల్లో చాలా మందికి పెన్షన్లు ఇవ్వడం తప్ప ఇతర పనులు ఉండటం లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆర్థిక భారంగా మారింది. అందుకే సమగ్ర సంస్కరణ దిశగా ఆలోచిస్తున్నారు.
విజన్ యూనిట్స్ లో అయినా పని ఉంటుందా ?
గ్రామ సచివాలయాలపేర్లను తీసేసి విజన్ యూనిట్స్ గా మారుస్తున్నారు. అయితే అక్కడ ఏం చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టమైన దిశానిర్దేశం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని సమర్థంగా ఉపయోగించుకుంటే.. విజన్ యూనిట్స్ కు సార్థకత ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం, పార్టీ కోసం పని చేసేందుకు వాలంటీర్లుతో పాటు ఈ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అది ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. ఇప్పుడు ఆ దుర్వినియోగాన్ని కొనసాగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. విజన్ యూనిట్స్ తో అది సాధ్యం అవుతుందని ఆశపడాలి.
