నేను కోర్టుకు రావాలంటే ప్రత్యేకమైన భద్రతాఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది .. అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం అందుకే కోర్టుకు రాలేను…అని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సీబీఐకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన కోర్టుకు వెళ్తే ఎందుకు ఏర్పాట్లు చేయాల్సి వస్తుందో.. అసలు నిజంగా అలాంటి ఏర్పాట్లు చేయాల్సి వస్తే కోర్టుకు ఎందుకు రారో ఆయనకు..ఆయన లాయర్లకే తెలియాలి. విదేశీ పర్యటనకు హాజరయ్యేటప్పుడు కోర్టు పెట్టిన షరతుల్లో ఒకటి… వచ్చాక వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావడం. కానీ జగన్ దాన్ని అడ్డమైన కారణాలు చెప్పి ఉల్లంఘిస్తున్నారు.
తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవుతా !
జగన్ రెడ్డి న్యాయవ్యవస్థను తక్కువగా అంచనా వేస్తున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు న్యాయమూర్తుల్ని సైతం వేధించిన ఆయన. .. సీజేఐపై తప్పుడు ప్రచారాలు చేశారు. సీఎం అయ్యాక అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు హాజరవడం మానేశారు. పదవి పోయాక కూడా హాజరు కావడం లేదు.చివరికి బెయిల్ షరతులు అమలు చేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఏదో ఓ పిచ్చి కారణం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. న్యాయవ్యవస్థతో ఆయన ఆడుకుంటున్న తీరు చూస్తే… ఎరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఆయనే కోర్టుకు ఆఫర్లు ఇస్తున్నారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ లో హాజరవుతానని చెబుతున్నారు.
కోర్టుకు హాజరవడం షరతుల్లో ఒకటి !
జగన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించినప్పటికీ .. వెళ్లి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ప్రధానమైన షరతు పెట్టింది. అది ఆయనకు ఇష్టం లేకపోతే అప్పుడే విదేశీ పర్యటన అనుమతి కోసం పెట్టుకున్న పిటిషన్ ను ఉపసంహరించుకోవాలి. కానీ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చి ఇలా తాను కోర్టుకు రానని మారం చేయడం ఆయనకే చెల్లింది.
ఓ నిందితుడు ఇలా చేయవచ్చా ?
జగన్ అక్రమాస్తుల కేసు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోయింది. ఆరేడుగురు న్యాయమూర్తులు మారిపోయారు కానీ కనీసం డిశ్చార్జ్ పిటిషన్లు కూడా క్లియర్ కావడం లేదు. ట్రయల్ ప్రారంభం కావడం లేదు. దీనికి కారణం జగన్ వేస్తున్న పిటిషన్లే. సీబీఐ పదే పదే ఇదే విషయాన్ని చెబుతోంది. ఇప్పుడు కోర్టు నిందితుడు విచారణలను ఆలస్యం చేయడంతో పాటు కోర్టుకు వచ్చేందుకు నామోషీగా భావిస్తున్న అంశాన్ని ఎలా తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
రౌడీషీటర్లను.. దొంగలను పరామర్శించడానికి వెళ్తున్నారే?
జగన్ రెడ్డి కోర్టును అవమానిస్తున్నారు. ఆయన గంజాయి స్మగ్లర్లను..దొంగలను పరామర్శించడానికి దర్జాగా వెళ్తున్నారు. కానీ కోర్టుకు మాత్రం రాలేను.. చాలా ప్రోటోకాల్ ఉంటుందని అంటున్నారు.ఆయనకు ఎలాంటి ప్రోటోకాల్ ఉన్నా.. కోర్టుకు సంబంధం ఉండదు. హాజరుకావాల్సిందే.
