జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు గందరగోళంగా ఉన్నాయి. జనసేన పార్టీ మద్దతు కోరి ఆ పార్టీ నేతల్ని తమ ప్రచార వాహనాల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు మాత్రం అడగడం లేదు. అదే సమయంలో టీడీపీ కూడా వారికి మద్దతివ్వాలని ఆసక్తి చూపించడం లేదు. టీడీపీ మద్దతు ప్రకటిస్తే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ అడిగితే సపోర్టు చేసే టీడీపీ ఉన్నా.. కేవలం జనసేనతో సరిపెట్టుకోవడం ఆశ్చర్యకరంగానే మారింది.
టీడీపీ పరోక్ష సపోర్టు సునీతకేనా ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు ఖాయం అని తేలిన తర్వాత టీడీపీ మద్దతు గురించి చర్చ జరిగింది. కేటీఆర్ స్వయంగా నారా లోకేష్ ను కలిశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. మాగంటి గోపీనాథ్ కరుడుగట్టిన టీడీపీనేత. ఎన్టీఆర్ అభిమాని. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాడు. ఆయినా ఆయన ఎప్పుడూ టీడీపీపై విమర్శలు చేయలేదు. చంద్రబాబును కూడా కొన్ని సార్లు కలిశారు.ఈ క్రమంలో మాగంటి సునీతకే టిక్కెట్ ఇస్తే టీడీపీ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ అభిప్రాయానికి వచ్చింది. సునీతకే చాన్స్ ఇవ్వడంలో టీడీపీ మద్దతు కూడా కీలకమని భావించారని చెబుతున్నారు.
బీజేపీ మద్దతు అడగకపోవడానికి అదే కారణమా?
కారణం ఏదైనా ఈ ఎన్నికల్లో బీజేపీ.. బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిని చివరి వరకూ ప్రకటించకపోవడం.. తర్వాత దూకుడుగా ప్రచారం చేయకపోవడం కూడా దీనికి కారణం. టీడీపీని మద్దతు అడిగితే ఆ పార్టీ మద్దతుదారులు బీజేపీకి ఓటు వేస్తే.. మాగంటి సునీతకు నష్టం జరుగుతుందని అందుకే సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో.. టీడీపీ మద్దతు బహిరంగంగా అడిగితే.. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజేస్తుందని అందుకే.. ఆ పార్టీ జోలికి బీజేపీ వెళ్లడం లేదని కూడా అంటున్నారు. అయితే జనసేన పార్టీతో పెట్టుకున్నప్పుడు.. లేని అడ్డం.. సెంటిమెంట్ సమస్య.. టీడీపీతో పెట్టుకుంటే ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
టీడీపీ సానుభూతిపరుల ఓటు ఎవరికి ?
ఎన్డీఏ కూటమిలో ఉన్నా.. ఆ కూటమి ఏపీకే పరిమితమని గతంలో కిషన్ రెడ్డి లాంటి వాళ్లు ప్రకటించారు. తెలంగాణలో ఎన్డీఏ ఉందని ఎవరూ చెప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నిక్లలో జనసేనతో పొత్తులు పెట్టుకున్నందున ఇప్పుడు ఆ పార్టీతో ప్రచారంలో పాల్గొంటే తప్పు లేదు కానీ.. టీడీపీ అంటే మాత్రం మళ్లీ ఆ పొత్తులు తర్వాత కూడా కొనసాగుతాయన్న ప్రచారం జరుగుతుందని అందుకే బీజేపీ దూరం పెట్టిందని కొందరు భావిస్తున్నారు. మద్దతు ప్రకటించినా ప్రకటించకపోయినా టీడీపీ సానుభూతిపరులు.. ఎవరికి వేయాలనుకుంటే వారికి వేస్తారని.. ఆ క్రమంలో మాగంటి సునీతకే మొదటి చాయిస్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
