‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చూశాక రష్మిక స్క్రిప్ట్ సెలెక్షన్ పై ఆశ్చర్యం కలిగింది. చాలా ఇండీసెంట్ కథ ఇది. దర్శకుడు చెప్పాల్సిన పాయింట్ ప్రీ-క్లైమాక్స్ వరకూ రాదు. ఫైనల్ చెప్పే పాయింట్ కూడా ఒక బ్లాక్‌మెయిలింగ్ లాంటిదే. ఈ పాయింట్ కూడా కొత్తది కాదు. తరుచూ సోషల్ మీడియాలో చూసేది. ప్రేమలో ఉన్న ఓ జంట ఏవో కారణాల వల్ల విడిపోయినప్పుడు.. ముఖ్యంగా అబ్బాయిలు బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతారు. ఇద్దరూ గడిపిన క్షణాలను, ప్రైవేట్ ఫోటోలను పబ్లిక్‌లో పోస్ట్ చేస్తారు. అక్కడితో ఆగకుండా అమ్మాయి నంబర్‌ను బస్‌స్టాప్‌లలో, సులభ్ కాంప్లెక్స్‌లలో రాసి సైకిక్ ఆనందం పొందుతారు. ఇంకొందరు సైకోలు పర్సనల్ వీడియోలను అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి.
‘గర్ల్ ఫ్రెండ్’ కథ కూడా ఇదే. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత అబ్బాయి నుంచి ఎదురయ్యే బ్లాక్‌మెయిలింగ్‌ను అమ్మాయి ఎలా తట్టుకుని నిలబడిందనేది ‘గర్ల్ ఫ్రెండ్’ మెయిన్ పాయింట్. నిజానికి ఇలాంటి పాయింట్‌ని కొత్తవాళ్లతో ప్రయత్నిస్తారు. ఇలాంటి పాయింట్లను పాన్-ఇండియా ఫేమ్ ఉన్న హీరోయిన్స్ చేయడానికి అసలు ఆసక్తి చూపించరు. కానీ రష్మిక ఈ కథను ఒప్పుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
కొన్ని కథలతో పర్సనల్ కనెక్షన్ ఉంటుంది. తమ చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలు కొన్నిసార్లు పెద్ద స్టార్స్‌కి కూడా ఇలాంటి కథలు చెప్పాలనే ఆసక్తిని కలిగించి ఉండవచ్చు. ఏదేమైనా ‘గర్ల్ ఫ్రెండ్’ విషయంలో రష్మిక ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.
