బీహార్లో మొదటి విడత ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కువ మంది .. మార్పు కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేశారని నమ్ముతున్నారు. అంటే ఎన్డిఏ ఓడిపోతోందన్నమాట. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిజానికి మొదటి నుంచి ఈ టాక్ ఉంది. ఫలితాల్లో అదే వస్తే అప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది ఇప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తాము ఓడిపోతే ఓట్ల చోరీ వల్లే ఓడిపోయామని గత్తర లేపడానికి రాహుల్ రెడీగా ఉంటారు. బీహార్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించినా అన్యాయంగా ఫలానా ఓటు తీసేశారని నిరూపించలేకపోయారు. అలాగే దొంగ ఓటర్లు ఉన్నారని కూడా నిరూపించలేకపోయారు. కానీ ఓడిపోతే మాత్రం ఓట్ల చోరీ అని నిందలు వేయడం మాత్రం ఖాయం.
ఫలితాలను తిరస్కరించే దమ్ము రాహుల్ కు ఉంటుందా?
గెలిస్తే ఏం చెబుతారన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకూ అర్థం కాని విషయం. ఈవీఎంలపై చేసిన ఆరోపణలు తేలిపోతాయి. అలాగే ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణలు కామెడీ అయిపోతాయి. తాము గెలిచాం కాబట్టి ఈ ఎన్నికను నిజాయితీగా నిర్వహించారని చెబితే ప్రజలు నవ్వుతారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తే వచ్చే సమస్యలే ఇవి. పరిస్థితి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉందని అనుకున్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన రాజకీయాలు చేయదు. తమను తాము ఇరుకున పెట్టే రాజకీయాలే చేసుకుంటుంది. బీహార్ లో ఇప్పుడు అదే జరుగుతోంది.
చేతకానితనంతో ఓడిపోయి ఎన్నికల వ్యవస్థపై నిందలు
హర్యానాలో గెలిచిపోతామని సర్వేలు చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ సహా కూటమిలోని పార్టీలను దూరం చేసుకున్నారు. ఒంటరిగా పోటీ చేసి అతి స్వల్ప తేడాతో సీట్లను కోల్పోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చిన ఓట్లతోనే కాంగ్రెస్ ఓడిపోయింది. తమ చేతకాని తనంతో హర్యానాలో ఓడిపోయి ఇప్పుడు ఓట్ల చోరీ అంటూ డ్రామాలు చేసుకుంటోంది. అలాంటి అవకాశం బీహార్ ఎన్నికల వరకూ మిగుల్చుకోలేదు. ముందుగానే డ్రామాలు ప్రారంభించి ఇరుక్కుపోతున్నారు. బీహార్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ వ్యూహాలకు మరోసారి ఓటమి ఎదురయినట్లు అవుతుంది.
గెలిచినా కాంగ్రెస్కు మైనస్ మార్కులే.. క్రెడిట్ అంతా తేజస్వీకే !
అంతే కాదు బీహార్ గెలుపులో కాంగ్రెస్ పార్టీకి కానీ.. రాహుల్ గాంధీకి కానీ ఒక్క శాతం కూడా క్రెడిట్ రాదు. పూర్తిగా తేజస్వీ యాదవే ఆ క్రెడిట్ కైవసం చేసుకుంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఫీల్డులోకి రాకపోయినా ..నితీష్ కుమార్ చాలా సార్లు మోసం చేసినా ఆయన కష్టపడి పార్టీని నిలబెట్టుకుని అధికారమలోకి తీసుకు వచ్చారని వీరతాళ్లు వేస్తారు. బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర.. ఓటు చోరీ పేరుతో హడావుడి చేసిన రాహుల్ ను ఎవరూ పట్టించుకోరు. ఆయనకు క్రెడిట్ ఇస్తే.. వాళ్ల గెలుపుపై వాళ్లు అనుమానాలు వ్యక్తం చేసినట్లే అవుతుంది.
