సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారాన్ని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కానీ సజ్జల సూపర్ విజన్ కాదు. ఇప్పటి కష్టాలన్నీ ఆయన వల్లేనని గట్టిగా నమ్ముతున్న వర్గం అంతా.. ఇప్పటికీ ఆయనే ఆదేశాలు జారీ చేస్తూండటాన్ని తట్టుకోలేకపోతున్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా మొత్తం వారి గుప్పిట్లోకి పోవడంతో చాలా మంది సైలెంట్ అవుతున్నారు. కానీ కొంత మంది మాత్రం బహిరంగంగానే విమర్శలు అందుకుంటున్నారు.
ఇటీవల పార్టీ కార్కక్రమాలను ఏం చేయాలి.. ఏలా చేయాలన్నది సజ్జల నేరుగా బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన పాయింట్లను వైసీపీ సోషల్ మీడియా పోస్టర్లుగా వేసి కార్యకర్తలకు పంపుతోంది. ఇందులో జగన్ ఫోటో ఉండటం లేదు. ఇది మరింతగా వివాదం అవుతోంది. అసలు సజ్జల ఎవరు అన్న ప్రశ్న ను ఎక్కువ మంది తీసుకు వస్తున్నారు. జగన్ ఫోటో కూడా లేకుండా వైసీపీ పార్టీ ప్రచారాన్ని చేయడం వీరికి నచ్చడం లేదు.
ఇలా నచ్చని వారికి పార్టీలో , సోషల్ మీడియాలో ప్రాధాన్యం ఉండటం లేదు. వారిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. సజ్జల గుడ్ లుక్స్ లో ఉన్న వారికి మాత్రమే ప్రోత్సాహం లభిస్తోంది. సజ్జలకు పోటీగా ప్రోత్సహించే మరో నేత లేడు. విజయసాయిరెడ్డి సహా అందర్నీ సజ్జల ప్లాన్డ్ గా దూరం చేసేశారు. అందుకే ఇప్పుడు సజ్జల చేస్తున్న వ్యవహారాల మీద అసంతృప్తితో కొంత మంది నిజంగానే తిరుగుబాటు చేసే దిశకు వచ్చారు. ఇవన్నీ జగన్ కు తెలియడం లేదని అనుకోవాలి.
