జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కేటీఆర్ చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ఐటం సాంగ్‌తో పోల్చారు. ఆ హీరోయిన్ ఐటం సాంగ్‌కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు. కేటీఆర్ తన ప్రచారాన్ని చుట్టూ స్క్రీన్లు పెట్టి అందులో రేవంత్ రెడ్డి స్పీచ్‌లను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి ఇలా కామెడీ చేశారు. అలాంటి మాటలు చెప్పి కేటీఆర్ తాము చేసిన మంచి పనుల్ని మూసేయలేరన్నారు. పాలన రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ లో తాగు నీటి సమస్య వచ్చినపుడు కుండలతో నిరసన తెలిపి, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు .. కృష్ణా జలాలను నగరానికి తరలించేలా చేసి జంట నగరాల దాహార్తిని తీర్చారన్నారు. విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ అందించడం వల్లే దిగ్గజ సంస్థలు నగరానికి తరలి వచ్చాయన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా తయారు కావడం వెనక కాంగ్రెస్ కృషి ఉందన్నారు. దేశంలోనే పర్ క్యాపిటాలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇందుకు ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలేనన్నారు. జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్ కు మెట్రో వచ్చిందని గుర్తు చేశారు.
60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్లలో 8 లక్షల 11 వేలకోట్ల అప్పులతో వాళ్లు మాకు అప్పగించారని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో… పాతాళంలోకి పడిపోయే స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారన్నారు. వారు కట్టిన కమాండ్ కంట్రోల్, సచివాలయం, ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం లేకపోయినా మా ప్రభుత్వంలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. 1 లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు.. ద్రుతరాష్టుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు కెసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కెసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నామని.. తాము హామీ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. కేటీఆర్‌తో ఉండలేక కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు.. సొంత చెల్లి వదిలేసి వెళ్లిపోయింది.. అలాంటి కేటీఆర్ తో కిషన్ రెడ్డికి సావాసమెందన్నారు. జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందేనని స్పష్టం చేశారు.


