ఒక్క చాన్స్ అని అడిగితే అవకాశం ఇచ్చి ఏపీ ప్రజలు నష్టపోయారని బీహార్ ప్రజలు అలాంటి తప్పు చేయవద్దని నారా లోకేష్ పట్నాలో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీహార్ వెళ్లిన నారా లోకేష్ అక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్నారు.
వికసిత్ భారత్ సాధనలో బీహార్ చాలా కీలకమని అందుకే ఎన్డీఏను గెలిపించాలన్నారు. ఏపీ మంత్రిగా రాలేదని.. ఓ పౌరుడిగా వచ్చానన్నారు. బీహార్ యువత మరోమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలన్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్ డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు.
గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఇంటికో ఉద్యోగం కాదని.. ఇంటికో పారిశ్రామిక వేత్త రావాలని అన్నారు. బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దని కోరారు. బీహార్ లో ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది.