చిరంజీవికి క్షమాపణలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సిద్ధాంతాల్లో క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండవు. కానీ అంతా అయిపోయాకే అసలు విషయం తెలుస్తుందన్నట్లుగా ఇప్పుడు ఆయన దగ్గర సరుకేం లేదు.. పట్టించుకునే దిక్కు కూడా లేదు కాబట్టి గతంలో తాను వెటకారం చేసిన వారు తనను ప్రోత్సహిస్తే కరిగిపోతున్నారు.
శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ కూడా మాట సాయం చేశారు. సినిమా గురించి.. ఆ సినిమా తీసిన ఆర్జీవీ గురించి గొప్పగా చెప్పారు. అందుకే ఆర్జీవీ చిరంజీవికి గతంలో చేసిన వెటకారాలు, అవమానాలు, మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన సినిమాల గురించి గుర్తుకొచ్చింది అలా చెప్పాలని అనిపించింది. కానీ ఇక్కడ ఆర్జీవీ అర్థం చేసుకోవాల్సిందిగా ఏమిటంటే.. ఆయనకు చిరంజీవి అయినా మరొకరు అయినా ఇచ్చే గౌరవం కేవలం తాను దర్శకత్వ ప్రతిభ చూపిన సినిమాల వరకే. ఆ ప్రతిభకే గౌరవం ఇస్తారు. వ్యక్తిత్వాన్ని మాత్రం అసహ్యించుకుంటారు.
ఎవరు ఔనన్నా.. కాదన్నా ఆర్జీవీకి భారత సినీ చరిత్రలో ఓ పేజీ ఉంటుంది. ఆయన సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఎంతోమందిని గైడ్ చేశాయి. కొత్త మార్పులకు కారణం అయ్యాయి. ప్రతిభ ఉన్న వాళ్లను ప్రోత్సహించాడు. మంచి టాలెంట్ ను ఇండస్ట్రీకి అందించారు. ఆ గౌరవం ఆయనకు ఉంటుంది. కానీ వ్యక్తిగా.. ఆయనను ఎవరూ గౌరవించరు. కనీస మాత్రం నమస్కారం పెట్టేంత గౌరవం కూడా సంపాదించుకోలేదు. తాను ఎంత మనుషుల పట్ల ఎంత ఘోరంగా వ్యవహరించేవారో.. ఇతరుల్ని కించపరిచే విషయంలోనూ అంతకంటే ఎక్కువగా ఉండేవారు.
కెరీర్ విషయంలోనూ ఎవరెస్ట్ నుంచి పాతాళంలోకి పడిపోయాక వ్యక్తిగా పూర్తిగా చితికిపోయారు. ఆయన తీసిన గొప్ప సినిమాలు, పేరు ప్రఖ్యాతులన్నీ అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఓ వెకిలి ఆర్జీవీ మాత్రమే అందరి ముందు ఉన్నారు. ఆ ఇమేజ్ ను ఆయన తుడిచేసుకోలేరు.. తన పాత ఘనతల్ని గుర్తు చేసి.. గౌరవం పొందలేరు. దానికి ఆయన అర్హత కోల్పోయారు.