మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ఎక్స్ ఖాతాలను ఎంపిక చేసుకునే క్రిప్టోకరెన్సీ మాఫియాలు వాటిని హ్యాక్ చేసి…తమ మెసెజులు పోస్ట్ చేస్తూంటాయి. తద్వారా క్రిప్టోకరెన్సీ వైపు మరింత మంది ఆకర్షితులయ్యేలా ప్లాన్ చేస్తూంటారు. ఇలాంటి కుట్రలకు జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ప్రభావితం అయింది. ఆ పార్టీ ట్వీట్టర్ హ్యాండిల్ ను హ్యాక్ చేసిన క్రిప్టో హ్యాకర్లు వెంటనే పాస్ వర్డ్ మార్చేసి.. ఆ పార్టీ టెక్ టీంకు చుక్కలు చూపిస్తున్నారు.
జనసేన పార్టీ ఎక్స్ హ్యాండిల్ కు రెండున్నర మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరంతా దేశవిదేశాల్లో ఉంటారు. వారి అకౌంట్ సెక్యూరిటీ బలహీనంగా ఉందేమో కానీ ఒక్క సారిగా ఆ హ్యాండిల్ ను హ్యాకర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. తమ పోస్టులు పోస్టు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు జనసేన పార్టీ తమ హ్యాండిల్ ను ఆపరేట్ చేయలేకపోతోంది. టెక్ టీం ఎక్స్ ను సంప్రదించి తమ ఖాతాను వెనక్కి తీసుకు వచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో తెలుగుదేశం పార్టీ , వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ ఖాతాలను కూడా ఇలాగే హ్యాక్ చేశారు. వాటిలో క్రిప్టోను ప్రమోట్ చేసుకున్నారు. నాలుగైదు రోజులకు గాను తమ ఖాతాను పునరుద్ధరించుకోలేకపోయారు. నిజానికి ఈ ఖాతాలను వారు శాశ్వతంగా ఉంచుకోవాలని అనుకోరు. ఆ మిలియన్ల మంది ఫాలోవర్లకు క్రిప్టో మార్కెట్ గురించి ఆశ పెట్టడానికే హ్యాక్ చేస్తారు. తమ పని పూర్తి కాగానే వదిలేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీకి అదే పరిస్థితి.
క్రిప్టో మాఫియా టెక్నికల్ గా ఎవరూ ఊహించనంత స్ట్రాంగ్ గా ఉంటుంది. వారు ఏ ఖాతాను హ్యాక్ చేయాలనుకుంటే ఆ ఖాతాను చాలా సింపుల్ గా హ్యాక్ చేసి తమ పని పూర్తి చేస్తారు. వారి నుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఇలాంటి ఖాతాలు ఒకరు మాత్రమే నిర్వహించరు. చాలా మంది కంట్రిబ్యూటర్లు ఉంటారు. అది వారి పని సులువు చేస్తుంది.


