తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తన పాలనపై ఆయనకు అమితమైన నమ్మకం ఉంది. ఎంత అంటే ఖచ్చితంగా మరో టర్మ్ తనకేనని ఆయన చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బల్ల గుద్ది చెబుతున్నారు. తాజాగా రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా మీడియా ప్రతినిధులు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లోనూ అదే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. కావాలంటే రాసి పెట్టుకోవాలని జర్నలిస్టులకు సవాల్ చేశారు. అలా చెప్పడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు చెప్పారు. ఓ సారి పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి కోపం తెప్పించారు కూడా.
రేవంత్‌కు అంత నమ్మకం ఎందుకు?
రేవంత్ రెడ్డి తనకు ప్రజలు మరో చాన్స్ ఇస్తారని మొదటి నుంచి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన ప్రజల మూడ్ ను విశ్లేషించి మరీ చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణల్లో గత ముఫ్పైఏళ్లుగా జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే ప్రతి పార్టీకి ప్రజలు వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం రెండు సార్లు గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. ఆ సైకిల్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అవకాశం వచ్చింది. అందుకే మరోసారి తమకు అవకాశం ఇచ్చి తీరుతారని రేవంత్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
సెంటిమెంట్ ఓకే కానీ.. ప్రజాస్వామ్యంలో అది ఫ్యాక్టర్ కాదు!
రేవంత్ రెడ్డి నమ్మకానికి లాజిక్ ఉంది కానీ.. ప్రజాస్వామ్యంలో గెలుపునకు అది అసలు ఓ ఫ్యాక్టర్ కానే కాదు. అది సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుంది. గతంలో మూడు సందర్భాల్లో పార్టీలకు రెండో సారి అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో బలమైన పాజిటివ్ కలసి వచ్చింది. రాజకీయ సమీకరణాలు కలసి వచ్చాయి. చంద్రబాబు రెండో సారి అధికారంలోకి రావడానికి ఆయన పని తీరు.. విపరీతమైన పాజిటివ్ వేవ్ కారణం. వైఎస్ఆర్ రెండో సారి గెలవడానికి.. లోక్ సత్తా, ప్రజారాజ్యం వంటి పార్టీల ఓట్ల చీలక కారణం, బీఆర్ఎస్ రెండో సారి గెలవడానికి తెలంగాణ సెంటిమెంట్ కీలకం. అలాంటి బలమైన ఎమోషనల్ అంశాలు రేవంత్ కు ఉంటే.. ఆయన లాజిక్ వర్కవుట్ అవుతుంది.
రేవంత్ కు ఎప్పుడు రాజకీయం చేయాలో తెలుసు!
ప్రస్తుతానికి రేవంత్ పాలనపై దృష్టి పెట్టారు. రాజకీయాలతో పాలనను మిక్స్ చేయలేదు. వీలైనంత వరకూ తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వాటి ద్వారా రాజకీయ లబ్దిని ఆశించడం లేదు. కానీ రెండో సారి అధికారంలోకి రావాలంటే ఓ బలమైన ఎమోషనల్ అంశం అవసరం. అలాంటివి ఆయన దృష్టిలో ఉండే ఉండి ఉంటాయి. వాటిని చాలా ఎఫెక్టివ్ గా తక్కువ టైంలో ప్రభావం చూడగలిగేలా వాడే సామర్థ్యం కూడా రేవంత్ వద్ద ఉంటుంది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారని అనుకోవచ్చు. రేవంత్ రాజకీయం.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


