కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే రిజల్ట్ తెలిసిపోతుంది. కొన్ని ట్రైలర్, టీజర్ వచ్చిన తర్వాత అర్థమైపోతాయి. దీనికి తగ్గట్టుగానే హీరో, హీరోయిన్లు ఆ ప్రాజెక్ట్‌కి ఇచ్చే ప్రాధాన్యతను నిర్ణయిస్తారు. ఒక సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి స్టార్లు ఆసక్తి చూపించడం లేదంటే, దాని రిజల్ట్ వాళ్లకు ముందే అంచనా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో సోనాక్షి సిన్హా తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే.
ఇటీవల ‘జటాధర’ సినిమా చేసింది సోనాక్షి. టెక్నికల్‌గా ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. ఒక పరిశ్రమకు పరిచయం కావడం అంటే ఎంతో ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. పైగా టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకోవాలంటే గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇస్తారు, కనీసం రికార్డ్‌గా ఉంచడానికి పేపర్ ఇంటర్వ్యూ పెట్టుకుంటారు. కానీ ‘జటాధర’ విషయంలో సోనాక్షి ఇవేవి చేయలేదు. జస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చి రెండు ముక్కలు మాట్లాడి “మమ” అనిపించింది.
నిర్మాతలు సోనాక్షిని ప్రమోషన్లలో భాగం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంటర్వ్యూలు నిర్వహించాలని చూశారు. కనీసం ఫోన్లోనైనా ఇంటర్వ్యూ తీసుకోవాలని ప్రయత్నించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం బ్రతిమాలారట. కానీ సోనాక్షి మాత్రం ఎంతమాత్రం ఆసక్తి చూపించలేదు. సినిమా చూసిన తర్వాత సోనాక్షి ఎంత తెలివిగా వ్యవహరించిందో అర్థమైంది. కాకపోతే `ఇది నా సినిమా కాదులే` అని వ్యవహరించినా, ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్టే. కెరీర్ పరంగా డామేజీ కలిగించే ఇలాంటి ఫ్లాపుల్ని చాలానే ఎదుర్కొంది సోనాక్షి. దీన్నించి ఎలా బయటపడుతుందో చూడాలి.


