ఓ చిన్న సినిమా హిట్టయితే చాలు. పరిశ్రమకు కొత్త జోష్ వచ్చేస్తుంది. చాలామందికి అవకాశాలు దొరుకుతాయి. సదరు దర్శకుడు, హీరో, ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు బిజీ అయిపోతారు. మొన్నటికి మొన్న ‘లిటిల్ హార్ట్స్’ కు ఇదే జరిగింది. ఇప్పుడు ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమానీ ఈ జాబితాలో చేర్చొచ్చు. ఎలాంటి అంచనాలూ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. తిరువీర్ హీరోగా నటించాడు. రాహుల్ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సింపుల్ కాన్సెప్ట్ తో సరదాగా మలిచిన కథ ఇది. తక్కువ బడ్జెట్లో సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. చూసినవాళ్లంతా ‘బాగుంది..’ అని మెచ్చుకొంటున్నారు. దాంతో ఈ దర్శకుడిపై నిర్మాతల ఫోకస్ పెరిగింది.
సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచే చాలామంది నిర్మాతల దగ్గర్నుంచి ఎంక్వైరీలు మొదలయ్యాయి. చిన్న, చితకా నిర్మాతల దగ్గర్నుంచి, బడా సంస్థల వరకూ ఈ దర్శకుడికి ఫోన్లు వెళ్లాయి. ‘కథ ఉంటే చెప్పు.. సినిమా చేద్దాం’ అంటూ ఆఫర్లు అందిస్తున్నారు. అయితే.. ‘…వెడ్డింగ్ షో’ నిర్మాతలకు దర్శకుడు మరో సినిమా కమిట్ అయ్యాడని టాక్. ముందస్తు ఎగ్రిమెంట్లు ఏం లేకపోయినా, తనకు తొలి అవకాశం ఇచ్చినందుకు ఆ సంస్థకే మరో సినిమా చేసి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. కాకపోతే.. రేసులో మైత్రీ, సితార లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి. రాహుల్ శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
పరిశ్రమకు కొత్త దర్శకులు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. కొత్త ఆలోచనలు, కొత్త కథలు వరుస కడతాయి. చిన్న సినిమాలు ఆడడం వల్ల.. కొత్త దర్శకులపై నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా.. ‘వెడ్డింగ్ షో..’ కొత్త దర్శకులకు, కొత్త ఆలోచనలకు కొత్త మార్గం వేసిందనడంలో సందేహం లేదు. మరి కొంత కాలం పాటు.. ఈ దర్శకుడి పేరు గట్టిగానే వినిపించే అవకాశం వుంది.


