జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి ఎనిమిది వేల ఓట్లతో గెలుస్తుందని ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ విశ్లేషించారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కచ్చితమైన ఫలితాలను రవిప్రకాష్ సర్వేల ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన తన మీడియా సంస్థ ద్వారా నిర్వహించిన సర్వేల్లో ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి పోటీ హోరాహోరీగా ఉన్నా.. చివరికి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అంచనా వేశారు. చాలా కొద్ది తేడాతో అంటే..ఆరేడు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారన్నారు.
జూబ్లిహిల్స్ లో ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల్లో అత్యధికం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తూ వచ్చాయి. ఇతర సర్వేలు అన్నీ భోగస్ అయినా.. అంతో ఇంతో విశ్వసనీయ సర్వేగా పేరున్న కేకే సర్వేస్ బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని సర్వే ప్రకటించారు. ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయన్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనాలు వేశారు.
రవిప్రకాష్ మాత్రం భిన్నమైన సర్వే ఫలితాలను ప్రకటించారు. కాంగ్రెస్ పాలన, హామీల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ దూకుడైన ప్రచారం చేయడం ఆ పార్టీ గట్టిపోటీ ఇవ్వడానికి ఉపయోగపడిందని.. బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందని తేల్చారు. కేకే సర్వే, రవిప్రకాష్ సర్వే.. ఇతర సర్వేల్లో నిజాలు ఎంతో.. పధ్నాలుగో తేదీన తేలనుంది.


