దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడి జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో సాయంత్రం 6.45 నిమిషాలకు భారీ శబ్దంతో కారు పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి పక్కన ఉన్న పది కార్లు కూడా తగలబడిపోయాయి. ఓ వ్యక్తి చనిపోయాడు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఉగ్రదాడేనని పేలుడు తీవ్రతను బట్టి అర్థమవుతోంది. వెంటనే ఢిల్లీ పోలీసులు..కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి.
కశ్మీర్ లో తప్ప..ఇటీవలి కాలంలో ఎక్కడా ఉగ్రదాడుల ప్రసక్తి లేదు. అనూహ్యంగా సోమవారం ఢిల్లీ పోలీసులు కలిసి ఫరీదాబాద్‌లోని ఒక డాక్టర్ ఇంటిపై దాడి చేశారు. అక్కడ 350 కేజీల అమ్మోనియం నైట్రేట్ , 20 టైమర్లు, AK-47 ఆయుధాలు, IED తయారీ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మెటీరియల్‌తో 2,900 కేజీల IEDలు తయారు చేయవచ్చని పోలీసులు అంచనా. అరెస్టయిన మహిళ డాక్టర్ ఇంట్లో ఈ మెటీరియల్ దాచి ఉంచారు. ఆమె జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జైష్ ఏ మహమ్మద్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా గుర్తించారు.
జైష్-ఎ-మహమ్మద్ , అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ వంటి నిషేధిత సంస్థలతో డాక్టర్లు కుట్ర పన్ని దేశంలో దాడులకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. ఢిల్లీలో వీరు భారీ పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా గుర్తించారు. అయితే అప్పటికే వీరు పేలుడుకు ప్లాన్ చేశారు. దాన్ని గుర్తించడంలో విఫలం కావడంతో బాంబులు పేలినట్లుగా తెలుస్తోంది.

