రవితేజ అంటేనే మాస్కి పండగ. కమర్షియల్ కథలకు కేరాఫ్ అడ్రస్స్. అందుకే మాస్ మహారాజ్ అయ్యాడు. అయితే మాస్ పల్స్ క్రమంగా మారుతోంది. మూస అభిరుచుల నుంచి వాళ్లు కూడా బయటపడుతున్నారు. ఫైటూ, పాట, రొమాన్స్.. సినిమా ఇలానే ఉంటే తిప్పి కొడుతున్నారు. కొత్త తరహా పాయింట్ లేకపోతే.. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా తిరస్కరిస్తున్నారు. కాకపోతే… ప్రేక్షకుల్లో ఇంత మార్పు వచ్చిందన్న సంగతి హీరోలు లేటుగా గ్రహిస్తున్నారు. రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రెగ్యులర్ టైపు కథలు, పాత్రలు ప్రేక్షకులు ఆహ్వానించడం లేదన్న సంగతి రవితేజకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. కాకపోతే ఆయనకు ఇప్పటికే వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. వాటి నుంచి బయటపడి.. మరోసారి తన అభిమానుల్ని అలరించాలన్న ఆలోచన ఇప్పుడాయనకు కలిగింది. అందుకే రవితేజ ఆత్మ విమర్శకు దిగారు. తన సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీలో తనకు బాగా కావల్సినవారి సలహాలూ, సూచనలు వింటున్నారు. అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకొంటున్నారు. నిజానికి రవితేజ స్వభావానికి ఇది విరుద్ధం. ఆయన ఎవరి మాటా వినరు. తనకు నచ్చిందే చేస్తారు. సలహా.. అనే మాటకు బహుదూరం. కాకపోతే మొండిగా ఉంటే ఇప్పుడు కుదరని పరిస్థితి. తప్పులు ఎక్కడ జరిగాయో చెక్ చేసుకోవడం అత్యవసరం.
రవితేజ చేతిలో ఉన్న సినిమా `భర్త మహాశయులకు విజ్ఞప్తి`. ఈరోజు గ్లింప్స్ వచ్చింది. రవితేజ రెగ్యులర్ ఫార్మెట్ తో పోలిస్తే భిన్నంగానే ఉంది. సాధారణంగా ఆయన సినిమాల గ్లింప్స్ అంటే మాస్ డైలాగూ, యాక్షన్.. ఇవే కనిపిస్తాయి. కానీ ఇది వేరే టైపు. క్లాస్ టచ్ తో సాగే ఫన్ డ్రామా. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిన హీరో కథలు మనకు కొత్త కాదు కానీ, రవితేజకు కొత్తగా అనిపించొచ్చు. సో.. మార్పు ఈ సినిమా నుంచే మొదలైందని అనుకోవొచ్చు. తాను కొత్తగా ఒప్పుకొనే సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని రవితేజ భావిస్తున్నాడట. ఆయన ఇది వరకే కొన్ని కథల్ని ఒప్పుకొని, అడ్వాన్సులు తీసుకొన్నారు. ఇప్పుడు అవన్నీ రివిజన్ చేస్తున్నారట. మారిన ప్రేక్షకుల అభిప్రాయాల్ని బట్టి రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ ఉండబోతోందని సన్నిహితులు చెబుతున్నారు. ఇది వరకు ఓకే చేసిన కథలు కూడా కొన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
రవితేజ అంటే ఇండస్ట్రీలో ఓ అభిప్రాయం ఉంది. తను రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నాడని నిర్మాతలు, అభిమానులు కూడా ఫిక్సయిపోతున్నారు. దాన్ని కూడా మార్చాలని మాస్ రాజా భావిస్తున్నాడట. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కోసం రవితేజ అసలు పారితోషికం డిమాండ్ చేయలేదని, సంక్రాంతికి విడుదల చేయాలన్న షరతుతోనే ఒప్పుకొన్నాడని, సంక్రాంతికి ఈ సినిమా విడుదలైతే వచ్చిన లాభాల్లో వాటా అందుకోవాలన్న ఆలోచనతో పని చేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజలో తాజాగా కనిపించిన అనూహ్యమైన మార్పు ఇది. స్క్రిప్టు విషయంలోనూ ఇంతే పట్టింపుతో ఉంటే.. తప్పకుండా రవితేజ నుంచి కొత్త తరహా కథలు, సినిమాలు చూసే అవకాశం ఉంది.
ఈ వరుస ఫ్లాపులకు రవితేజ ఒక్కడే కారణం కాదు. దర్శకులూ కారణమే. వాళ్లు పాత పోకడల్ని పక్కన పెట్టి కథలు రాసుకోవాల్సిన అవసరం ఉంది.


