చాలా కాలం తర్వాత బీహార్లో అయినా అధికారం చేపట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమికి మరోసారి ఎదురుదెబ్బ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వాన్ని నిలబెట్టబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇయాన్స్ -మార్టిజ్, చాణక్య స్ట్రాటజిస్, పీ మార్క్, ప్రజాపోల్..ఇలా దేశంలో ఇప్పటి వరకూ విడుదల చేసిన సెఫాలజీ కంపెనీల రిపోర్టులన్నీ ఎన్డీఏ వైపే కనిపిస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుస్తుందని చెప్పడం లేదు.
సాధారణంగా భారీ పోలింగ్ జరిగితే.. అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అనుకుంటారు. తేజస్వీ యాదవ్ ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చినా ప్రజలు వెల్లువలా వచ్చి బీజేపీ కూటమికే ఓట్లేశారని .. ఎన్నికలకు ముందు ఇచ్చిన తాయిలాలు పని చేశాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రభావం కూడా నామమాత్రమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ ఏ మాత్రం విశ్వసనీయత లేనివే. ఎప్పుడో ఓ సారి తమ అంచనాలు కరెక్ట్ అయ్యాయని .. ఇలా చెబుతూ ఉంటాయి. ఎన్నో సార్లు వీరి ఎగ్జిట్ పోల్స్ తప్పాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కాస్త విశ్వసనీయంగా ఉంటాయి. ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఆలస్యంగా ప్రకటిస్తుంది. ఇవన్నీ ఓటర్ల మూడ్ తెలుసుకోవడానికి పనికొస్తాయి. కానీ ఫలితాలు ఇలాగే ఉండాలనేం లేదు. హర్యానాలో జరిగింది అదే.

