ఏపీకి పెట్టుబడుల సాధనలో బిజీగా ఉన్న నారా లోకేష్ .. మరో కీలక విజయం సాధించారు. జగన్ రెడ్డి దెబ్బకు పరారైన ఓ కంపెనీ మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని నారా లోకేష్ ఓ ట్వీట్ ద్వారా తెలియచేశారు. అయితే ఆ కంపెనీ ఏమిటన్నది మాత్రం ఆయన బయట పెట్టలేదు. గురువారం ఉదయం 9 గంటలకు ఆ వివరాలు ప్రకటిస్తామన్నారు.
పెట్టుబడుల వార్త అని నారా లోకేష్ నేరుగానే చెప్పారు. చిన్న కంపెనీలు అయితే ఆయన ఇలా టీజర్ ఇవ్వరు. బడా కంపెనీనే.. బడా పెట్టుబడే అయి ఉంటుంది. 2019లో వెళ్లిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. రిలయన్స్ ఎలక్ట్రానిక్ సిటీ , లూలు, ప్రకాశం జిల్లాలో పేపర్ ఫ్యాక్టరీ, సింగపూర్ కన్సార్షియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటిలో ఏ కంపెనీ వస్తుందన్నది మాత్రం లోకేష్ క్లూ ఇవ్వలేదు. గురువారం ఉదయం తెలుసుకోవాల్సిందే.
14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ స్థాయిలో దిగ్గజ పారిశ్రాకమికవేత్తల్ని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారందర్నీ ఆహ్వానించారు. కేవలం ఎంవోయూలే కాకుండా.. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ఈ సదస్సులో ఒప్పందాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపై కొన్ని పనులు చక్కపెట్టేందుకు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.
