ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కళ కనిపిస్తోంది. ఆర్థిక రాజధానిగా మారిన విశాఖ నుంచి ఏపీ నలువైపుల అభివృద్ధి చెందేలా పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన వేదిక రెడీ అయింది. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు విశాఖలో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు సందడి చేయనున్నారు. ఇప్పటికే వారందరితో ప్రభుత్వం ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సమ్మిట్ ద్వారా ఏపీకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామికవేత్తలకు పెరిగిన విశ్వాసాన్ని ఈ సమ్మిట్ నిరూపించనుంది.
ప్రచారం కోసం కాదు.. కేవలం వాస్తవిక పెట్టుబడులకే ప్రాధాన్యం
ప్రచారం కోసం ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే ఎంవోయూలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. పూర్తిగా ఎగ్జిక్యూషన్ ఒప్పందాలే ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున శంకుస్థాపనలు కూడా జరగనున్నాయి. గతంలో ప్రభుత్వాలు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగేవి. కానీ అసలు గ్రౌండ్ లోకి వచ్చేది తక్కువ. వైసీపీ హయాంలో నిర్వహించిన సమ్మిట్ లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు అని ఒప్పందాలు చేసుకున్నారు కానీ.. పదమూడు కోట్లు కూడా పెట్టుబడులుగా ఎవరూ పెట్టలేదు. అందుకే ఈ సారి ఒప్పందాలు కాకుండా.. గ్రౌండింగ్ ముఖ్యమని చర్యలు తీసుకుంటున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు.
గత కొన్ని నెలలుగా పారిశ్రామిక వర్గాలతో విస్తృత సంప్రదింపులు
ప్రభుత్వం ఓ టెంట్ వేసి.. ఎవరో ఒకర్ని పిలిచి ఒప్పందాలు చేసుకోవడం కాకుండా.. గత ఆరేడు నెలలుగా పెట్టుబడుల సదస్సు కోసం కసరత్తు చేస్తోంది. కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గట్టి ప్రయత్నాలు చేసింది. చంద్రబాబుకు సీఐఐతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వారు దేశవిదేశాల్లో రోడ్ షోలు ఏర్పాటు చేసి.. పారిశ్రామిక వేత్తలను ఏపీ సమ్మిట్ కు ఆహ్వానించారు. ఇలా ఆహ్వానాలు పంపిన పారిశ్రామిక వేత్తల్లో దాదాపుగా మూడు వందల మందికి పైగా వస్తున్నట్లుగా సమాచారం పంపారు. దేశ పారిశ్రామిక రంగంలో చంద్రబాబుకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రమబద్ధంగా ఇంత కాలం చేసిన సన్నాహాలు ఫలించి.. రెండు రోజులపాటు పెట్టుబడుల రూపంలో ఆ శ్రమ కళ్ల ముందు ఉండనుంది.
అత్యంత సుందరంగా విశాఖ ముస్తాబు
విశాఖపట్నం మొత్తాన్ని సుందరీకరించారు. అరవై కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి.. రోడ్లు, డివైడర్లు సహా బ్యూటిఫికేషన్ పూర్తి చేశారు. అతిధులకు పక్కాగా అతిథి మర్యాదలు అందేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇప్పటికే చిన్న అపశృతి కూడా జరగకుండా.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీ గురించి ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్ పై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎప్పుడూ కొంత మంది రెడీగా ఉంటారు కాబట్టి అలాంటి వారిపైనా .. పోలీసు వర్గాలు నిఘా పెట్టి ఉన్నాయి. శుక్రవారం , శనివారం విశాఖ అంతా.. పండుగ వాతావరణం ఏర్పడనుంది.


