12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే.. ఆ ఇల్లు అద్దెకు ఉండేవారి సొంతం అవుతుందని ఓ అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. కిరాయిదారు అక్కడ అద్దెకు ఏళ్ల తరబడి ఉంటున్న కారణంగా ఎప్పటికీ ఇంటి యజమాని కాలేడు అడ్వర్స్ పొసెషన్ అంటే 12 ఏళ్లు ఉంటే ఆస్తి సొంతమవుతుందనే నియమం కిరాయిదారులకు వర్తించదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో విష్ణు గోయల్ అనే వ్యక్తి 30 ఏళ్లకుపైగా కిరాయి ఇంట్లో ఉన్నాడు. తర్వాత అద్దె కట్టడం ఆపేసి తానే యజమానని అని క్లెయిమ్ చేసుకున్నాడు. హైకోర్టు మొదట అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇంటి యజమానిదే ఆస్తి అని స్పష్టం చేసింది. కిరాయిదారు యజమాని అనుమతితోనే ఉంటాడు. అందుకే అడ్వర్స్ పొసెషన్ వర్తించదని తెలిపింది.
అడ్వర్స్ పొసెషన్ అంటే ఒక వ్యక్తి మరొకరి ఆస్తిని తనదిగా ఉపయోగిస్తూ, యజమాని అనుమతి లేకుండా 12 సంవత్సరాలు ఉంటే ఆ ఆస్తి అతని సొంతమవుతుందనే చట్ట సూత్రం. ఇది భారతదేశంలో లిమిటేషన్ యాక్ట్, 1963లోని ఆర్టికల్ 65లో ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆస్తిని విస్మరించిన యజమానులను శిక్షించడం, భూమిని ఉత్పాదకంగా ఉపయోగించినవారిని ప్రోత్సహించడం. ఈ సూత్రం పని చేయాలంటే మూడు ముఖ్య నియమాలు తప్పనిసరి. ఆక్రమణ అవిరామంగా 12 ఏళ్లు ఉండాలి, రహస్యంగా కాకుండా అందరికీ తెలిసేలా బహిరంగంగా ఉండాలి, యజమానికి వ్యతిరేకంగా “ఇది నా ఆస్తి” అనే ఉద్దేశ్యంతో (ఉండాలి. ఈ మూడూ లేకపోతే అడ్వర్స్ పొసెషన్ క్లెయిమ్ రాలేదు.
అడ్వర్స్ పొసెషన్ ప్రభుత్వ భూమి, ఖాళీ ప్లాట్లు, విస్మరించిన ఆస్తులపై వర్తిస్తుంది కానీ కిరాయిదారులు, కుటుంబ సభ్యులు, లైసెన్సీలు వంటి అనుమతితో ఉన్నవారికి వర్తించదు. గ్రామీణ ప్రాంతాల్లో షేర్క్రాపర్లు కొన్నిసార్లు దీన్ని ఉపయోగించుకుంటారు కానీ కిరాయి ఇళ్లలో ఇది పూర్తిగా నిషేధం.


