ఫిల్మ్ మేకర్‌గా తనకంటూ ఒక ముద్రని సృష్టించుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన గ్రామర్ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఆయన నుంచి సరైన కంటెంట్ రావడం లేదు. ఓటీటీ వేదికలకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి రవిబాబు మ్యాజిక్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. ఇప్పుడు నరేష్ ప్రధాన పాత్రలో ఏనుగుతొండం ఘటికాచలం అనే కామెడీ సినిమా చేశాడు. ఈ-విన్ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా రవిబాబు మార్క్‌తో అలరించిందా? ఏమిటీ ఘటికాచలం కథ?
ఏనుగుతొండం ఘటికాచలం (నరేష్) రిటైర్డ్ ఎంప్లాయ్. తనకొచ్చే పెన్షన్ డబ్బులే తన ఇద్దరు కొడుకులకు ఆధారం. పెన్షన్ డబ్బు వచ్చిన మరు క్షణమే చెరో సగం పంచేసుకుంటారు. ఇంట్లో ఎవరి గోల వాళ్లదే. భార్య కాలం చేయడంతో ఒంటరితనం ఘటికాచలాన్ని ఊపిరాడనివ్వదు. పని మనిషి భవాని (వర్షిణి) ఘటికాచలాన్ని ఆదరిస్తుంది, ఆప్యాయత చూపిస్తుంది. ఒంటరి జీవితానికి ఓ తోడు కోసం భవానిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. తర్వాత ఏం జరిగింది? 65 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన ఘటికాచలం కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఒంటరితనాన్ని భరించలేని ఓ వృద్ధుడి కథ ఇది. ఈ పాయింట్లో ఆ వృద్ధుడి బాధ ఉంది. కానీ రవిబాబు ఈ కథని ఒంటరితనంతో మొదలుపెట్టి ఇన్సూరెన్స్ డబ్బుల డ్రామాగా కథనం నడిపాడు. రవిబాబు స్టైల్లో టైటిల్స్ వస్తున్నప్పుడు కచ్చితంగా ఇందులో ఏదో ఒక స్పెషల్ ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడతాయి. ఒక్క సీన్లోనే ఘటికాచలం ఒంటరితనాన్ని చూపించగలిగాడు రవిబాబు. వెంటనే పెళ్లికి సిద్ధమైపోవడం, ఆ తర్వాత శోభనం ఎపిసోడ్.. ఇక్కడ వరకు కథనం ఎంతో కొంత ఆసక్తికరంగానే సాగుతుంది.
ఎప్పుడైతే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అక్కడి నుంచి రాత, తీత రెండూ బలహీనంగా తయారవుతాయి. ఇలాంటి కథ చెప్పడానికి రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ అక్కర్లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడే డ్రామా చాలా సాదాసీదాగా ఉంటుంది. సిట్యువేషన్ నుంచి కామెడీ రాబట్టుకోవాలనిది రవిబాబు ముఖ్య ఉద్దేశం. కాకపోతే సిట్యువేషన్ నుంచి కామెడీ రాకపోగా ఒక దశలో విసుగు పుడుతుంది. కామెడీకి బిలీవబిలిటీ ప్రధాన ఇంధనం. కానీ ఇందులో సన్నివేశాలు నమ్మదగినవిగా ఉండవు.
రకరకాల పాత్రలు పరిచయం అవుతుంటాయి కానీ ఏ పాత్ర కూడా నవ్వించేలా ఉండదు. ఫ్రిజ్‌లో రోజుల తరబడి ఉన్న బాడీ ఒక్కసారిగా జీవం పోసుకుంటూ బయటికి వస్తుంది. దానికి కూడా ఏదో ఒక సైంటిఫిక్ లాజిక్ ఇచ్చారు. కానీ అదంతా పప్పెట్ షోలా ఉంటుంది. అంతకుముందు కొడుకుకి తండ్రి వేషం వేసి నడిపిన డ్రామా సహజత్వానికి ఆమడ దూరంలో ఉంటుంది.
కాకపోతే రవిబాబు ఇందులో ‘డబ్బు’ క్యారెక్టర్ చూపించిన కోణం మాత్రం కొంచెం ఆలోచింపజేసేలా ఉంటుంది. ఈ రోజుల్లో హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ బిజినెస్ అయిపోయాయి. డబ్బే ఆటలాడిస్తుంది. అందరికీ డబ్బే కావాలి. ఇంకో మనిషిని చంపినా సరే, తను తన కుటుంబం ఆనందంగా ఉండాలనుకోవడం మనిషి లక్షణంగా మారుతోంది. ఈ పాయింట్‌ని చూపించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. కాకపోతే రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా కాదిది.
నరేష్ ఎప్పటిలానే సహజంగా చేశారు. తన వయసుకి తగ్గ పాత్రది. ఒకటే ఎక్స్ ప్రెషన్ తో కనిపించడం అంత తేలిక కాదు. వర్షిణి పాత్రలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా, ఆ పాత్ర ఈ డ్రామాలో చలాకీగా ఉంటుంది. గిరిధర్, అలీ, రఘుబాబు, శ్రీకాంత్ భరత్.. ఇలా ఉద్దండులే ఉన్నప్పటికీ కామెడీ వర్క్ అవుట్ కాలేదు. ఘటికాచలం ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటుడి ట్రాక్, అస్తమానూ కరెంట్ కట్ చేసే ఇంటి ఓనర్ పాత్రలు కొన్ని చోట్ల నవ్విస్తాయి.
దాదాపు సింగిల్ లొకేషన్ కథ ఇది. ప్రొడక్షన్ డిజైన్‌లో రవిబాబుదీ ప్రత్యేకమైన స్టైల్. ఇందులోనూ ఒక యూనిఫామ్ టోన్ కనిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ ఓటీటీ సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి. పెద్దగా నవ్వురాని, ఎమోషన్‌గా కనెక్ట్ కాని సినిమా ఇది. రవిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనే అంచనాతో చూస్తే మరింత నిరుత్సాహపడాల్సి వస్తుంది.


