విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన పాలసీలు బడా కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పుడు యాక్సెంచర్ తో పాటు ఇన్ఫోసిస్ కూడా విశాఖలో డెవలప్మెంట్ సెంటర్స్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయాన్ని సీఎన్బీసీ చానల్ ప్రకటించింది. ఈ రెండు సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. ప్రభుత్వ పాలసీ ప్రకారం భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉండటంతో ఆ క్యాంపస్ లు కూడా విశాఖకు రానున్నాయి.
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం గేమ్ ఛేంజర్ గా మారినట్లుగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు మధ్యస్థ కంపెనీలు కూడా విశాఖకు పెట్టుబడుల వెల్లువ వస్తోంది. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి విశాఖను చిరునామాగా చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. రాష్ట్రం విడిపోయిన తొలి ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దిశగా వేసిన ప్రయత్నాలు ఫలితం ఇచ్చేలోపునే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి విశాఖకు ఐటీ పరిశ్రమల రాక ఆగిపోయింది.
మళ్లీ సీఎం అయిన తర్వాత కంపెనీలను ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదు సంవత్సరాల ఘోరమైన పరిపాలన తర్వాత ఇండస్ట్రీలు రావడానికి తటపటాయిస్తున్న సమయంలో.. పెట్టుబడుల ఫ్రెండ్లీ పాలసీలు తీసుకు వచ్చి కంపెనీలను ఆకర్షిస్తున్నారు. ఈ రెండు కంపెనీలు ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకుంటే.. విశాఖ సాఫ్ట్ వేర్ బిగ్ లీగ్ లో చేరిపోయినట్లే అనుకోవచ్చు.

