Kaantha Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కొన్ని పాత్రలు కథల వల్ల పండుతాయి.
కొన్ని కథలు పాత్రధారుల ప్రతిభతో మెరుస్తాయి.
ఏం చేసినా.. జనాన్ని రంజింపజేయడం ముఖ్యం.
‘కాంత’ అచ్చంగా నటీనటుల ప్రతిభతో మెరిసే కథ. ఓ వైపు దుల్కర్ సల్మాన్, మరోవైపు సముద్రఖని.. మధ్యలో రానా, భాగ్యశ్రీ భోర్సే.. వీళ్లంతా చాలాసార్లు కలిసికట్టుగా, ఒక్కోసారి ఎవరికి వారే.. ‘కాంత’ కథని మెరిపింపజేశారు. కాకపోతే కొన్ని లోపాలు, స్లో ఫేజ్ నేరేషన్ ఈ సినిమాని వెనక్కి లాగాయి. ఇంతకీ కాంత కథేమిటి? ఇందులో నటీనటులెలా పోటీ పడ్డారు? కథనంలో లోపాలేంటి?
అయ్య (సముద్రఖని) పేరు మోసిన దర్శకుడు. తన తల్లి ‘శాంత’ కథని సినిమాగా తీసి ప్రేక్షక లోకానికి పరిచయం చేయాలనుకొంటాడు. ఆ కథలో హీరో… మహదేవన్ (దుల్కర్ సల్మాన్). ఒకప్పుడు అయ్య ప్రియ శిష్యుడు. ఏమీ లేని మహదేవన్ ని సూపర్ స్టార్ చేసింది అయ్యనే. కానీ ఇద్దరి మధ్య ఓ సమస్య. ఈగో క్లాష్. అందుకే దూరం పెరుగుతుంది. ఓసారి ‘శాంత’ కథ పట్టాలెక్కినట్టే ఎక్కి.. మధ్యలో ఆగిపోతుంది. ఆ తరవాత మళ్లీ కొత్తగా మొదలవుతుంది. ఈసారి అయ్యపై డామినేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు మహదేవన్. ‘శాంత’ పేరుని `కాంత`గా మార్చేస్తాడు. అంతేకాదు.. క్లైమాక్స్ కూడా తనకు అనుగుణంగా రావాలని పట్టుపడతాడు. కథానాయికగా కుమారి (భాగ్యశ్రీ బోర్సే)ని రంగంలోకి దింపుతాడు అయ్య. కుమారికి ముందు వెనుక ఎవరూ లేరు. అంతా.. అయ్యనే. తను అయ్య అడుగుజాడల్లోనే నడుస్తుంది. అది మహదేవన్‌కు నచ్చకపోయినా… కుమారి అందం, ప్రతిభకు ముగ్థుడైపోతాడు. క్రమంగా ప్రేమలో పడతాడు. అయ్య – మహదేవన్ ల మధ్య రాజీ కోసం కుమారి తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ సయోధ్య కుదరదు. మొత్తానికి ‘కాంత’ పట్టాలెక్కుతుంది. కాకపోతే.. ఎవరి క్లైమాక్స్ తో ఈ సినిమా పూర్తయ్యింది. ఈ సినిమాకు పేకప్ చెప్పేలోగా జరిగిన పరిణామాలేంటి? అసలు గురు శిష్యుల మధ్య గొడవెందుకు వచ్చింది? అనే విషయాలు తెరపై చూడాలి.
కథగా చెప్పుకోవాలంటే గురు శిష్యుల మధ్య క్లాష్ ఇది. దానికి ఓ మర్డర్ మిస్టరీ జోడించాడు. కథకి పిరియాడిక్ టచ్ ఇచ్చాడు. సినిమాలో సినిమా కథ చెప్పాడు. ఇలా ఓ సాధారణమైన కథకు హంగులు జోడించి కొత్త టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా మొదలైన 5 నిమిషాల్లోనే దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. దర్శకుడూ హీరో మధ్య ఈగో క్లాష్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపించగలిగాడు. సముద్రఖని – దుల్కర్ సల్మాన్ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవాలనుకొనే సీన్లు బాగా పండుతాయి. కథలో ప్రేక్షకుడ్ని లాక్కెళ్లి కూర్చోబెడతాయి. వీళ్ల మధ్య ఏం జరిగింది? అనే క్యూరియాసిటీ కల్పిస్తాయి. కుమారి రంగ ప్రవేశంలో రొమాంటిక్ యాంగిల్ మొదలవుతుంది. ఆ పాత్రని కూడా దర్శకుడు చక్కగా రాసుకొన్నాడు. ఓ దశలో.. `మహానటి` సినిమానో – సావిత్రి కథనో మళ్లీ తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. భాగ్యశ్రీ బోర్సే స్థానంలో కీర్తి సురేష్ కళ్ల ముందు కదులుతూ ఉంటుంది.
‘కాంత’ సినిమా విడుదలకు ముందు ఓ వివాదం రాజుకొంది. గొడవ కోర్టు వరకూ వెళ్లింది. `ఇది ఓ బయోపిక్` అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది సూపర్ స్టార్ల కథలు మనసుల్లో కదలాడుతూ ఉంటాయి. సినిమా వాళ్ల జీవితాలు, వాళ్ల ఈగో గోలలూ అచ్చంగా ఇలానే ఉంటాయేమో..అనిపించేలా ఆ సీన్లు డిజైన్ చేశాడు దర్శకుడు.
కొన్ని చోట్ల కచ్చితంగా క్లాప్స్ పడతాయి. రచయిత తాలూకు పెన్ పవర్ కంటే.. నటీనటుల ప్రతిభ ఆయా సన్నివేశాల్ని నిలబెట్టాయి. ముఖ్యంగా సముద్రఖని – దుల్కర్ మధ్య ఈగో క్లాష్ కు సంబంధించిన సీన్లు బాగా పండాయి. దుల్కర్‌ని భాగ్యశ్రీ చంప దెబ్బ కొట్టే సీన్ లో దుల్కర్ నటన మెచ్చుకోదగినది. ‘అద్దం’ సీన్ లో.. అటు దుల్కర్, ఇటు సముద్రఖని పోటాపోటీగా నటించారు. ఒకొక్క అడుక్కీ హావభావాలు మారుస్తూ దుల్కర్ ప్రదర్శించిన అభినయం కచ్చితంగా గుర్తుండిపోతుంది. చాలా వరకూ మోనో లాగ్లే. సింగిల్ షాట్ సీన్లు చాలా కనిపిస్తాయి. అలాంటి సీన్ ని దర్శకుడు డిజైన్ చేయగలిగాడంటే అది కచ్చితంగా నటీనటులపై నమ్మకంతోనే.
ఇంట్రవెల్ ముందు కథలో మర్డర్ మిస్టరీ ప్రవేశిస్తుంది. అందుకు సంబంధించి తొలి సీన్ లోనే ప్రేక్షకుడ్ని ప్రిపేర్ చేశాడు దర్శకుడు. సెకండాఫ్ లో రానా ఎంట్రీ ఇస్తాడు. తన క్యారెక్టర్ కాస్త జోవియల్ గా ఉంటుంది. ఇంట్రాగేషన్ సీన్లు ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రానా పాత్రని కూడా అండర్ ప్లే చేయగలిగితే బాగుండేది. అలాంటప్పుడు ఎక్కువ తెలివితేటలు వాడాల్సిన అసవరం ఏర్పడుతుంది. క్లూని రాబట్టడం, ఇన్వెస్టిగేషన్ చేయడంలో కొత్త పంథాలో వెళ్లుంటే బాగుండేది. సెకండాఫ్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు దుల్కర్ పాత్ర కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్తిపోతుంది. ఆయా సన్నివేశాల్ని రానా ఓవర్ టేక్ చేస్తాడు. కానీ దుల్కర్, సముద్రఖని పక్క పక్క సీట్లలో కూర్చున్న సీన్… అక్కడ దుల్కర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మోనో లాగ్.. ఇవన్నీ మళ్లీ దుల్కర్ లోని నటుడ్ని బయటకు తీసుకొస్తాయి. క్లైమాక్స్ లో అయితే… తన నట విశ్వరూపం కనిపిస్తుంది. సెకండాఫ్ లో కాస్త లాగ్ ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్ కి ముందు మళ్లీ దర్శకుడు పట్టు సాధించాడు. చివర్లో సంతృప్తికరమైన ముగింపు ఇచ్చాడు. ఓవర్ డిటైలింగ్ వల్ల.. సన్నివేశాల కల్పనలో ‘స్లో ఫేజ్’ చొరబడిపోయింది. ఆర్కిస్టిక్ మూమెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కమర్షియల్ యాంగిల్ కనిపించదు. ఇలాంటి సినిమాలు విమర్శకుల్ని మెప్పిస్తాయి. కానీ సాధారణ ప్రేక్షకుడి అభిరుచులకు దూరంగా ఉండిపోతాయి. సినిమా లో సినిమా సంగతులెప్పుడూ.. చిత్రసీమకు దగ్గరగా ఉన్నవాళ్లకు నచ్చుతుంటాయి. కానీ సాధారణ ప్రేక్షకుడికి ఇవేం పట్టకపోవొచ్చు. ఈగో క్లాష్ అనే కథ.. మర్డర్ మిస్టరీగా టర్న్ అవ్వడం వల్ల జోనర్ షిఫ్ట్ లో జంప్ కనిపిస్తుంది. దానికి ప్రిపేర్ అయిన ప్రేక్షకుడికి అది బాగుంటుంది. లేదంటే… ‘ఈ కథలో మర్డర్ మిస్టరీ ఏంటి’ అనిపించే ప్రమాదం వుంది. దర్శకుడికీ, హీరోకీ ఉన్న ఈగో క్లాష్‌కి రీజన్ బాగానే రాసుకొన్నా.. దాన్ని హడావుడిగా చూపించేశారేమో అనిపిస్తుంది.
నటీనటుల ప్రతిభతో మెరిసిన కథ ఇది. దుల్కర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పర్ఫెక్ట్. భూతద్దం పెట్టుకొని వెదికినా వంకలు దొరకవు. సముద్రఖని చాలా సీన్లలో అండర్ ప్లే చేశాడు. ‘ఇంకో టేక్ కావాలేమో అడుగు’ అన్నచోట… మరింత నచ్చేస్తాడు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో చాలా సీన్లు పండించాడు. సర్ప్రైజింగ్ ఏమిటంటే భాగ్యశ్రీ కూడా నటనా పరంగా కొన్ని మార్కులు దక్కించుకొంటుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్రలతో మెప్పించడం అంత తేలికేం కాదు. రానా క్యారెక్టర్ మొదట్లో కాస్త లౌడ్ గా కనిపించింది. ఈ సినారియోలో ఎందుకో మ్యాచ్ కాలేదేమో అనిపిస్తుంది. కానీ రాను రాను తాను కూడా పట్టు సంపాదించాడు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినవాళ్లు సైతం తమ పూర్తి స్థాయి ప్రతిభ చూపించేశారు. కాస్టింగ్ పరంగా పర్ఫెక్ట్ సినిమా ఇది.
టెక్నికల్ గా సౌండ్ ఉన్న సినిమా ఇది. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ ప్రేక్షకుల్ని ఆకాలంలోకి తీసుకెళ్లిపోయాయి. నేపథ్య సంగీతం కూడా వినసొంపుగా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఓ నవల చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. డీటైలింగ్ బాగుంది. ఫస్టాఫ్ వరకూ దర్శకుడు, రచయిత సమపాళ్లలో రాణించారు. సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ డ్రామాని ఇంకా బాగా నడిపించాల్సింది. అప్పుడు ‘కాంత’ స్థాయి మరింత పెరిగేది. ఓ సినిమాలో నటీనటులంతా కలిసి కట్టుగా విజృంభించిన అరుదైన సన్నివేశాల కోసం ఈ సినిమా నిరభ్యంతరంగా చూడొచ్చు. దుల్కర్ అభిమానులకైతే ఇంకా బాగా నచ్చుతుంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
– అన్వర్


