ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవాడు ఎవరు?. అమెరికా అధ్యక్షుడో.. రష్యా ప్రెసిడెంటో.. చైనా ప్రీమియరో కాదు. అందరి కంటే సర్వశక్తిమంతుడు దేవుడు. దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే ఎవరు ఏ రూపాన్ని నమ్ముతారో ఆ రూపంలో ఉంటాడు. మరి దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఉండవా అని కొందరు వితండవాదం చేస్తూంటారు. కచ్చితంగా దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ దెయ్యాలు దేవుళ్లను కూడా దోచుకుంటున్నాయి. మనిషి రూపంలో ఉన్న దెయ్యాలు దేవుళ్లను కూడా వదిలి పెట్టడం లేదు. డబ్బాశ, అప్పనంగా పట్టనంత సంపాదించాలన్న కోరికతో బరి తెగిస్తున్నారు. దానికి మన కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. తిరుమల శ్రీనివాసుడిని, ఆయన భక్తుల్ని ఐదు సంవత్సరాల పాటు దోచుకున్న వైనం ఒక్కొక్కటిగా బయటకు వస్తూంటే అయ్యో దేవుడా… అని భక్తులు మనోవేదనకు గురి కావాల్సి వస్తోంది.
కొంత కమిషన్ కోసం య్యి కాని నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేసేంత దోపిడీ
“తిరుమల శ్రీవారి ప్రసాదం అనేది స్వీట్ కాదు. అది భక్తుల ఎమోషన్” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఇది వంద శాతం నిజం. మన చిన్నతనం నుంచి శ్రీవారి ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో అందిరికీ తెలుసు. తిరుమల నుంచి తీసుకు వచ్చిన లడ్డూ నుంచి ఓ చిన్న ముక్క తుంచి ఇస్తే.. కాళ్లకు ఉన్న చెప్పులు విడిచి.. రెండు చేతులతో పవిత్రంగా పెట్టి తీసుకుని.. కళ్లకు అద్దుకుని నమో వెంకటేశాయ అని స్మరించి నోట్లో వేసుకుంటాం. అది ఆకలి తీర్చేందుకు కాదు. దేవుడే మనకు పంపిన ఆశీర్వాదం అనుకుంటాం. కోట్లాది మంది హిందువులకు అత్యంత పవిత్రమైన అలాంటి ప్రసాదాన్ని ఐదు సంవత్సరాల అత్యంత దారుణంగా కల్తీ చేశారు. అసలు నెయ్యి కాకుండా.. పూర్తి రసాయనాలు వాడి తయారు చేసిన నెయ్యి లాంటి నెయ్యిని వాడారు. ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇది జరిగింది. కావాలనే చేశారు. అంతకు ముందు ప్రసిద్ధ డెయిరీల నుంచి టీటీడీ నెయ్యి కొనుగోలు చేసేది. కర్ణాటకలో నందిని డెయిరీ వంటివి నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే .. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో అపచారం ప్రారంభమయింది. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని చెప్పి.. టెండర్లు మార్చేసి.. నిబంధనలు కలగాపులగం చేసి ఎక్కడో ఉత్తరాఖండ్ లో ఉండో భోలేబాబా డెయిరీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఆ బోలేబాబా డెయిరీ ఒక్కటంటే ఒక్క లీటర్ పాలు సేకరించలేదు. వెన్ను కొనుగోలు చేయలేదు. కానీ నెయ్యిని మాత్రం తయారు చేసింది. ఎలా తయారు చేసిందో కూడా సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్పష్టం చేసింది. అడ్డగోలుగా రసాయనాలు కొనుగోలు చేసి నెయ్యి రూపంలో కెమికల్ తయారు చేసి దాన్ని టీటీడీకి సరఫరా చేసింది. అది నెయ్యి కాదని తిరుమల తిరుపతి దేవస్థానాలకు చైర్మన్ గా పని చేసిన సుబ్బారెడ్డికి తెలియదా?. తెలియకుండా ఎలా ఉంటుంది..అసలు టెండర్లు మార్చి.. భోలేబాబాకు ఇచ్చేలా చేసిందే ఆయన కదా !. అది మహాపాపం అయని ఆయనకు అనిపించలేదు. ఎందుకంటే ఆ డెయిరీ ఇచ్చే కమిషనే ఆయనకు గొప్పగా అనిపించింది.
దేవుడ్నే దోచుకోవాలనే ఆలోచన దుస్సాహసం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే సంపాదించుకోమని ఇచ్చిన పదవి కాదు. దేవుడిపై భక్తితో ఆయనను ఒక్క క్షణం దర్శించుకుని కష్టాలు తీర్చుకునేందుకు అవసరమైన దారి చూపమనో.. తీర్చేందుకు అవసరమైన దారి చూపాడనో ముక్తి పొందేందుకు వచ్చే భక్తులకు ఏ కష్టం రాకుండా చూసేందుకు ఇచ్చిన పదవి. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికే సేవ చేయడం. అది కూడా సుబ్బారెడ్డి సొంత డబ్బులతో చేయరు. భక్తులు ఇచ్చే కానుకల డబ్బులతోనే చేస్తారు. కొన్ని వేల మంది శ్రీవారికి ఉచితంగా సేవ చేయడానికి వాలంటీర్లుగా తిరుమలకు వస్తూంటారు. వారెవరూ తిరుమలలో చిన్న తప్పు కూడా చేయాలనుకోరు. ఎందుకంటే వారు భక్తితో చేసే సేవ.. దేవుడికి చేస్తున్నట్లుగానే భావిస్తారు. అలాంటిది స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకే చైర్మన్ గా అవకాశం వస్తే.. ఆ భక్తులకు ఇంకెంతో సేవ చేసి..భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇక్కడేం జరిగింది?. భక్తుల ఆరోగ్యాలను సైతం దోచుకునేందుకు దొరికిన అవకాశంగా భావించారు. నెయ్యి కాని నెయ్యిని కొనిపించి.. అంతా తెలిసి దానితోనే ఐదు సంవత్సరాల పాటు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూను తయారు చేసి పంచారు. వారు ఏం చేస్తున్నారో భక్తులకు తెలియదు.. ఆ ప్రసాదం ఏదో తేడాగా ఉందని భక్తులు అనుకున్నా.. అలా అనుకుంటే దేవుడిని కించ పరచడమే అనుకని స్వీకరించారు. పోటు కార్మికులే కాదు.. కొన్ని వేల మంది లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయో ఘనత వహించిన టీటీడీ పాలకులకు తెలుసు. తాము కమిషన్లు కొట్టేసి నెయ్యి కాని నెయ్యిని లడ్డూలో ఉపయోగించేలా చేసి.. భక్తుల నమ్మకాన్ని కూడా అమ్మేసుకున్నామని వారు లోలోపల నవ్వుకుని ఉంటారు.
దొరికినా బయట పెట్టరన్న ధైర్యం – భక్తుల మనోభావాల చాటున దాక్కోవచ్చన్న అతి తెలివి
వీరు ఎంత గుండెలు తీసిన బంటులు అంటే.. ఒక వేళ దొరికిపోయినా భక్తుల మనోభావాల పేరుతో బయట పెట్టరని అనుకున్నారు. ఇప్పుడు దొరికిపోయిప్పుడు అదే వ్యూహం పాటిస్తున్నారు. లడ్డూ కల్తీ అయిందని చెప్పారని అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటున్నారు. కల్తీ చేసిన దొంగలు.. తమ తప్పు కప్పి పుచ్చుకోవడానికి కల్తీ కాలేదని చెప్పకుండా.. అలా అయిందని చెప్పడమే తప్పని వాదిస్తున్నారంటే.. దేవుడిని వారు ఎంత టేకిట్ఈజీగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నెయ్యి కల్తీ గురించి మొదటగా చంద్రబాబు ప్రకటించినప్పుడు.. ఒక్క సారిగా భక్తుల మనోభావాల పేరుతో దాడి చేశారు. న్యాయవ్యవస్థలోనూ అదే కారణంతో పిటిషన్లు వేశారు. చంద్రబాబు ఆషామాషీగా చెప్పలేదు. నిజాలు నిర్దారించుకున్న తర్వాతనే చెప్పారు. ఆ నిజం ఇవాళ కాకపోతే రేపు అయినా తెలిసిపోతుంది. అప్పుడు దాచి పెట్టి ఉంటే తర్వాత బయటపడినప్పుడు చంద్రబాబుదే తప్పు అయ్యేది. ఈ కల్తీ నిందితులు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి .. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే దర్యాప్తు బృందం నిజాలు బయటపెడుతూంటే మళ్లీ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అంటున్నారు. దేవుడిపై ఏ మాత్రం భక్తి లేకుండా ఆయనను విపరీతంగా దోచుకుని.. భక్తుల ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టిన ఇలాంటి వారు.. భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకుని బయటపడాలని అనుకోవడం వింతేమీ కాదు. ఎందుకంటే వీరికి దేవుడిపై భయం, భక్తి ఏమీ లేవు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోచుకోవడం మాత్రమే తెలుసు.
హుండీనే దోచిన దొంగను నిలువుదోపిడీ చేసిన గజదొంగలు
దేవుడికి, భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రసాదంలో ఉయోగించే నెయ్యిలోనే వీరు దోచుకున్నారంటే.. ఇక ఇతర అంశాల్లో నిజాయితీగా ఉంటారని ఎలా అనుకోగలం. దొరికినప్పుడే దొంగతనం బయటపడుతుంది. అలా సుదీర్ఘ కాలంగా దేవుడి హుండీ సొమ్మును దోచుకుంటున్న రవికుమార్ అనే వ్యక్తి.. దొంగతనం చేస్తూ దొరికిపోతే.. అతన్ని నిలువుదోపిడీ చేసి పడేశారు ఈ దొంగలు. కొంత మొత్తం ఆస్తులు టీటీడీ పేరుతో రాయించి మిగతా మొత్తం తమ పేర్లపై మార్పించుకున్నారు. ఇప్పుడీ విషయం కూడా బయటకు వచ్చింది. పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. దేవుడిని దోచిన దొంగను పట్టుకుంటే.. ఆ దొంగను దోచుకున్న వాళ్లను ఇంకేమనాలి?. టీటీడీ చైర్మన్ పదవి చివరి ఏడాది అయినా బీసీకి ఇస్తామని ప్రచారం చేశారు. కానీ ఇతరులకు ఇస్తే తమ దోపిడికీ అడ్డుకట్ట పడుతుందని .. జగన్ రెడ్డి బంధువు అయిన కరుణాకర్ రెడ్డికే ఇచ్చారు. ఆయన టీటీడీ నిధులతో తన కుమారుడికి ఎన్నికల ఖర్చులు చేశారు. ఇవన్నీ ఆధారాలతో సహా విజిలెన్స్ రిపోర్టుల్లో ఉన్నవే. ఆ మధ్య ఇదే కేసులో తన తండ్రిని అరెస్టు చేయబోతున్నాని భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయరెడ్డి రచ్చ రచ్చ చేశారు. కానీ అరెస్టులు జరగలేదు. శ్రీవారి దర్శనాల పేరుతో వీరు చేసిన వ్యాపారాన్ని.. చెవిరెడ్డి చేసిన దందాలను తెలుసుకుంటే.. వీళ్లకా దేవుడంటే భయం,భక్తి ఉన్నది అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది.
పశ్చాత్తాపం చెంది నిజాలు అంగీకరించి ..దేవుడ్ని క్షమాపణ కోరాలి !
ప్రపంచంలో అరాచకాలు జరగకుండా ఎంతో కొంత మంచి, మానవత్వం సమాజంలో మనగలుగుతోందంటే దానికి కారణం దేవుడు చూస్తాడు అనే భయమే. ఎవరు ఏ దేవుడినైనా నమ్మవచ్చు. ఆ నమ్మకమే అసలైన ధైర్యం. ఆ దేవుడే అన్నీ ఇచ్చాడని అనుకుంటారు. అవకాశాలు తమకు రావడం దేవుని కృపే అనుకుంటారు. తమ వెనుక దేవుడు ఉన్నాడు అన్న నమ్మకమే ఎన్నో విజయాలకు పునాది వేస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే పైన దేవుడు ఉన్నాడంటారు. సుబ్బారెడ్డి కూడా తాము దేవుడ్ని విపరీతంగా నమ్ముతామంటారు. ఆయన కోసం మాటలు చెప్పేవారు ఉదయం రెండు గంటలు పూజ చేయనిదే సుబ్బారెడ్డి బయటకు రారని మోస్తూ ఉంటారు. నిజంగా ఇది నిజం అయితే.. దేవుడ్ని దోచుకున్న దొంగలంతా పశ్చాత్తాపం చెందాలి. తాము తప్పు చేశామని అందుకే తమకు ఇప్పుడు ఈ గతి పడుతోందని వాస్తవంలోకి వచ్చి అంచనా వేసుకోవాలి. దేవుడి సన్నిధిలో…. దేవుడిని, ఆయన భక్తులను దోచుకున్న లెక్కలన్నీ బయట పెట్టాలి. దేవుడే శిక్షిస్తున్నాడు అనుకుని చట్టం ముందు లొంగిపోవాలి. మా దేవుడు కాదు కదా మమ్మల్ని శిక్షించడు అని అనుకుంటే అంత కంటే దేవుడని మోసం చేయడు మరొకటి ఉండదు. మీరు పాపాలు చేయండి.. దోచుకోండి.. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టండి.. నేను అండగా ఉంటానని ఒక్క దేవుడు కూడా చెప్పడు. ఎందుకంటే.. దేవుడు అయ్యాడంటే.. దానికి కారణం ప్రేమ, దయా, క్షమ వంటివి లోకవ్యాప్తం చేయడం ద్వారానే. దోచుకోండి.. పాపాలు చేయండి.. క్షమించేస్తాను అంటే.. ఆ దోపిడీలకు గురయ్యేవారు ఆయన భక్తులు కాదా?. అలా తన భక్తులను ఇతర భక్తులు దోపిడీ చేస్తే క్షమిస్తాడా ? .
చేసిన పాపం పండి తీరుతుంది!
దేవుడు ఉన్నాడా లేడా చర్చ అప్రస్తుతం. కానీ దేవుడనే నమ్మకం మాత్రం శాశ్వతం. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. విజయం వచ్చినా దేవుడ్ని తలుచుకుంటారు. అదే దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నిరూపిస్తుంది. అందుకే ఆయన కన్నెర్ర చేయక ముందే చేసిన తప్పుల్ని చట్టం ముందు ఒప్పుకుని ..భారం దించుకోవాలి. దేవుడు విధించే శిక్ష నుంచి అయినా తప్పించుకోవచ్చు. చట్టం శిక్షిస్తుందా లేదా అన్నది కూడా ఆ దేవుడే చేసుకుంటాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఉండదంటారు. అది నిజం చెప్పడం ద్వారా.. చేసిన తప్పులను ఒప్పుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. మరి ఈ దేవుడినే దోచిన దెయ్యాలు దానికి సిద్ధంగా ఉంటాయా?


