జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని .. పోలింగ్ కు ముందు చాలా సర్వేలు వచ్చాయి. కొంత మంది అదే పనిగా కాంగ్రెస్ ఓడిపోతుందని రుద్దారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నమ్మకం తగ్గిపోయింది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తీసుకున్న రెండు నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి కారణం అయ్యాయని అనుకోవచ్చు.
రేవంత్ తీసుకున్న మొదటి వ్యూహాత్మక నిర్ణయం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం. మజ్లిస్ నుంచి 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్ ను.. ఉపఎన్నిక వస్తుందని తెలియగానే రేవంత్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన కోసం పోటీలో ఉన్న ఇతర నేతల్ని వ్యూహాత్మకంగా తప్పించారు. తానే పోటీ చేస్తానని పట్టుబట్టిన అజహరుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీనికి కారణం.. నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో వ్యక్తిగత బలం ఉండటమే. ఎలా లేదన్నా.. ఆయన ఇరవై వేల ఓట్ల వరకూ పోల్ చేయించుకోగలరు.
అలాగే మజ్లిస్ పార్టీ మద్దతు కూడా కీలకం. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ నవీన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పోలింగ్ సమయంలోనూ ఆ పార్టీ శ్రేణులు తమదైన ఎలక్షనీరింగ్ చేశాయి. షేక్ పేటలో కొన్ని బూతుల్లో ఏకపక్షంగా ఓటింగ్ జరిగేలా మజ్లిస్ చూసుకుంది. ఇలా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం, మజ్లిస్ సపోర్టు పొందడంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో .. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.


