కర్మ హిట్స్ బ్యాక్ అని జూబ్లిహిల్స్ ఉపఎన్నికల తర్వాత కవిత ట్వీట్ పెట్టారు. నిజానికి ఆమె ఆ ట్వీట్ లో ఇంకేమీ పెట్టలేదు. కానీ అందరూ ఎవరికి కావాల్సిన అర్థం వారు తీసుకున్నారు. ప్రధానంగా కేటీఆర్ ను టార్గెట్ చేశారని ఎక్కువ మంది భావిస్తున్నారు.అందులో నిజం ఉంది. ఆమె టార్గెట్ ఇప్పటికి తనకు అన్యాయం చేసిన కీటీఆర్, హరీష్‌ల మీదనే ఉంది. అందుకే అలా ట్వీట్ చేశారని అనుకోవచ్చు. కేటీఆర్, హరీష్ రావులకు మరిన్ని ఎదురు దెబ్బలు తగిలేలా…. తన వంతు పాత్ర పోషించాల్సి వస్తే కవిత అలాంటి అవకాశాలను వదిలి పెట్టే చాన్స్ లేదు.
గతంలో ఎమ్మెల్యేలు చనిపోతే వదిలి పెట్టని బీఆర్ఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ సంప్రదాయం ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబసభ్యులకే అవకాశం కల్పిస్తూ పోటీ చేయకపోవడం అనే సంప్రదాయాన్ని పాటించేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం మూమెంట్.. అధికార పార్టీగా ఎన్నికలు ఎలా గెలవాలో తెలిసిన కేసీఆర్.. ఎవరు చనిపోయినా వదిలి పెట్టలేదు. కాంగ్రెస్ నుంచి పాలేరు, ఖేడ్ ఎమ్మెల్యేలు చనిపోతే అభ్యర్థుల్ని నిలబెట్టి భారీ విజయాలు సాధించారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితి ఎదురవుతూ వచ్చింది.
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి – రెండు చోట్లా ఓడిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్జీ మార్చేసిన సంప్రదాయం కారణంగా ఇప్పటి వరకూ రెండు సీట్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే..కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే చనిపోయారు. ఆ ఎన్నికలో బీజేపీ చేతులెత్తేయడంతో డిపాజిట్ వచ్చింది కానీ సీటు పోయింది. గతంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకే అవకాశం ఇచ్చినట్లయితే ..కాంగ్రెస్ కాస్త నైతికంగా వ్యవహరించి ఉండేది కానీ.. అలా చేయలేదు. కర్మ హిట్స్ బ్యాక్ అంటే ఇదే.
అందరికీ వర్తిస్తుంది !
అంతా బాగున్నప్పుడు ఇక మాకు తిరుగులేదు అనుకుంటే.. రేపు పరిస్థితులు తిరగబడినప్పుడు మరింత ఘోరంగా మారుతుంది. అది ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవిస్తోంది. ఆ పార్టీని నడుపుతున్న నేతలు అనుభవిస్తున్నారు. కానీ ఇంతే అహంకారంతో వ్యవహరిస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి.. మరొకిరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. కర్మ ఎవర్నీ వదిలి పెట్టదు. ఎవరికి చెల్లించాల్సింది వారికి చెల్లిస్తుంది. టైం రావాలి అంతే.


