దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ఇద్దరూ కలిసి నటించి, నిర్మించిన చిత్రం ‘కాంత’. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు కొంత వివాదం నడిచింది. ‘ఇది మా తాత కథే.. ఆయన జీవితాన్ని సినిమాలో వక్రీకరించాలని చూస్తున్నారు’ అంటూ అలనాటి తమిళ స్టార్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ మనవడు చెన్నై న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సివచ్చింది. చిత్రబృందం కూడా ఈ విషయంపై స్పందించింది. తాము ఎవరి కథనీ సినిమాగా తీయడం లేదని, ఇది పూర్తిగా ఫిక్షన్ అని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు… భాగవతార్ కుటుంబ సభ్యులకు సినిమా చూపించాలన్న నిర్ణయం తీసుకొంది. దాంతో.. ‘కాంత’ కథకూ.. ఆ స్టార్ జీవితానికీ సంబంధం, ఉందా లేదా? అనే చర్చ మొదలైంది. శుక్రవారం సినిమా విడుదలైన తరవాత ఆ కోణంలో ఈ సినిమాని చూడడం మొదలెట్టారు.
‘కాంత’ కథ వరకూ వస్తే ఓ స్టార్కూ, ఓ దర్శకుడికీ మధ్య వచ్చే క్లాష్ ఇది. ఓ అనామకుడ్ని ఓ దర్శకుడు స్టార్ హీరోగా మారుస్తాడు. ఆ తరవాత ఆ దర్శకుడికీ, హీరోకీ మధ్య అభిప్రాయ బేధాలొస్తాయి. హీరోపై అక్కసుతో.. సదరు దర్శకుడు.. ఓ కేసులో అనవసరంగా హీరోని ఇరికిస్తాడు. దాందో హీరో జైలు పాలు అవుతాడు. ఓ మర్డర్ కేసులోనూ ఇరుక్కొంటాడు. ఆ తరవాత హీరో ఎలా బయటకు వచ్చాడన్నదే ‘కాంత’ కథ.
ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనలే జరిగాయి. తమిళ సినీ చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్… ఎం.కె.త్యాగరాజ భాగవతార్. తన తొలి 10 సినిమాలూ హిట్టే. ఓ సినిమా మూడేళ్ల పాటు ఏక ధాటిగా థియేటర్లలో ఆడింది. ఓ దర్శకుడితో గొడవ వల్ల తన జీవితం తల్లకిందులైంది. ఆ దర్శకుడే త్యాగరాజన్ని అనవసరంగా ఓ కేసులో ఇరికించి, జైలు పాలు చేశాడని చరిత్ర చెబుతోంది. బయటకు వచ్చాక సరైన అవకాశాలు రాలేదు. ఆ తరవాత 49 ఏళ్లకే అనారోగ్యంతో మరణించాడు.
త్యాగరాజ భాగవతార్ జీవితంలోని కొన్ని విషాద కోణాలు ‘కాంత’ కథలో కనిపించాయి. అయితే ఇవన్నీ యాదృచ్చితంగా జరిగాయా, లేదంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని వాడుకొని, ఈ కథ రాశారా? అనేది దర్శక నిర్మాతలకే తెలియాలి. కాకపోతే.. ‘కాంత’ సినిమా వల్ల ఒకప్పటి సూపర్ స్టార్ జీవితాన్ని, తన జీవితంలోని విషాదాన్నీ మరోసారి గుర్తు చేసుకొనే అవకాశం దక్కింది.
