బీహార్ లో కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షంలో ఉండి కూడా భారీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. దానికి కారణం ఎవరు ?. అందరూ లాలూ ప్రసాద్ జంగిల్ రాజ్ కారణం అని అంటున్నారు. కానీ దానికి ఆర్దేడీ, కాంగ్రెస్ ఒప్పుకోవు. తాము ఓటమిపై సీరియస్ గా రివ్యూ చేసుకుంటామని రెండు పార్టీలు చెబుతున్నాయి. కానీ ఆ రెండు పార్టీకు కనిపించేది రెండు కారణాలే.. ఒకటి..ఈవీఎంలు..రెండు ఓట్ల చోరీ. ఎందుకంటే వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడానికి రాటుదేలిపోయారు మరి.
బీహార్ లో కాంగ్రెస్ ఓటమికి స్వయంకృతమే కారణం
బీహార్లో కాంగ్రెస్ కూటమి ఓటమికి వారు చేసిన రాజకీయాలే కారణం. నితీష్ కుమార్ పై ఉన్న అధికార వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుని యువతకు అద్భుతమైన భవిష్యత్ ఇస్తామని నమ్మకం కల్పించాల్సింది పోయి.. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నట్లుగా రాజకీయాలు చేశారు. ఎన్నికలకు ముందు ఓటర్ అధికార యాత్ర చేశారు. ప్రజాసమస్యలను కాకుండా.. ఎన్నికల వ్యవస్థపై అనుమానం వ్యక్తం చేసేలా ప్రచారం చేశారు. చివరికి ఓ సందర్భంలో.. తేజస్వీ తాము ఎన్నికల బహిష్కరణకు ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అక్కడే వారి పతనం ఖాయమయింది. రాహుల్ కు తగ్గట్లే తేజస్వీ తమ నెత్తిన తాము చేయి పెట్టుకున్నారు.
ఈవీఎంలను నిందించడం ఈజీ
ఓటమికి ఈవీఎంలను నిందించడం చాలా ఈజీ. ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తోందని తమ పార్టీ మద్దతుదారులను బుజ్జగించడానికి అవకాశం ఉంది. కానీ ఈవీఎంలతో అక్రమాలు అసాధ్యమని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గతంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు.. నియోజకవర్గం మొత్తం ఓట్లు కుప్ప పోసి లెక్కలు కట్టేవారు. కానీ ఇప్పుడు బూత్ల వారీగా ఓట్ల లెక్క తెలుస్తోంది. అంటే.. ప్రజల ఓట్లకు చాలా స్పష్టమైన లెక్క తెలుస్తోంది. తేడా వస్తే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం వస్తుంది. కానీ అలాంటిదేమీ లేదంటే.. ప్రజలు గుంభనంగా తాము ఎవరికి వేయాలో వారికి వేసినట్లే అన్నమాట.
ఓట్ల చోరీ కూడా ఈ సారి ఓ కారణం చెప్పుకోవచ్చు !
ఓట్ల చోరీ పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. బీహార్ లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేసి.. 70 లక్షల ఓట్లను తొలగించింది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఓటు పోయిందని పోలింగ్ బూత్ వద్ద గోల చేయలేదు. పైగా అత్యధిక ఓటింగ్ పర్సంటేజీ నమోదు అయింది. అయినా సరే.. చాలా చోట్ల తీసేసిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీలు ఉన్నాయని ప్రచారం చేయవచ్చు. ఆ ఓట్లు లిస్టులో ఉంటే ఎవరూ ఓటేసేవారు కాదు.. పోలింగ్ పర్సంటేజీ మాత్రం తగ్గేది. దాని వల్ల ఫలితం మాత్రం మారదు. ఆ విషయం కాంగ్రెస్ కు కూడా తెలుసు. కానీ నింద మాత్రం వాడుకోవచ్చు.
ఓట్లచోరీ, ఈవీఎం కథలు పక్కన పెట్టి..కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ బ్రెయిన్ వాష్ చేసుకుంటే తప్ప ముందుకెళ్లడం చాలా కష్టం.


