టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అనారోగ్యం వచ్చింది. ఎంత అనారోగ్యం అంటే తిరుపతికి వెళ్లి సిట్ ఎదుట హాజరు కావడానికి కూడా ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. తాను రాలేనని కావాలటే మీరే వచ్చి ప్రశ్నించుకోవచ్చని సిట్ కు సమాచారం ఇచ్చారు. దాంతో సిట్ అధికారులు 20వ తేదీన హైదరాబాద్ కు వెళ్లి ఆయనను ప్రశ్నించనున్నారు.
వైవీ సుబ్బారెడ్డినే మొత్తం నెయ్యి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఎక్స్ పోజ్ అవుతున్నారు. బోలేబాబా డెయిరీ వ్యవహారంలో మొత్తం ఆయనే ఉన్నారని.. పెద్ద ఎత్తున లంచాలు కూడా తీసుకున్నట్లుగా ఆధారాలు గుర్తించారు. మాజీ పీఏ అప్పన్న దొరికిపోవడం.. ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ బయటకు తీయడంతో సుబ్బారెడ్డి లింకులు బలంగా బయటపడ్డాయి. అదే సమయంలో కల్తీ అని తెలిసినా సరే.. నెయ్యి సరఫరాను కొనసాగించారని అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు కూడా వాంగ్మూలం ఇచ్చారు.
ఈ లెక్కలన్నీ బయటకు వస్తూండటంతో సుబ్బారెడ్డి కంగారు పడిపోతున్నారు. విచారణ ఆపడానికి గతంలో ఓ సారి పిటిషన్ వేసి చాలా రోజులు ఆలస్యం అయ్యేలా చేశారు. సిట్ ఇచ్చే ప్రతి నోటీసుపైనా ఆయన కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. ఆయన కంగారు చూస్తే.. భుజాలు తడుముకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం విచారణ చేస్తోంది సుప్రీంకోర్టు సిట్. అందుకే ఆయనకు ఎన్ని మాయ రోగాలు వచ్చినా తప్పించుకోవడం కష్టం అవుతుంది. అలాంటి ప్రయత్నాలు ఆయనను అసలు నిందితుడిగా ప్రజల ముందు నిలబెడతాయి.


