సీవీ ఆనంద్ ఐపీఎస్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు. కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ ఆయన విధి నిర్వహణలో ఫలానా తప్పు చేశారని వేలెత్తి చూపించేవారు లేరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆయన.. ఆ డైనమిక్స్ ను అర్థం చేసుకోలేకపోయారు. ఆదివారం అలా స్క్రోల్ చేస్తూ ఓ ట్వీట్ రిప్లైకు ఇచ్చిన రిప్లై ఆయన ఇమేజ్ను చాలా డ్యామేజ్ చేసింది. ఆయన మనసులో అనుకున్నట్లుగా నెటిజన్లు అనుకోరు. నెగెటివ్ గానే ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ అదే జరిగింది.
బాలకృష్ణను కించ పరిచేలా చేసిన కామెంట్‌కు ఎమోజీ రిప్లై
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు బదిలీ అయ్యే ముందు పైరసీ రాకెట్ ను పట్టుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఐ బొమ్మ ఆట కూడా కట్టిస్తామని ప్రకటించారు. అప్పటికే ఆయనకు బదిలీ ఆదేశాలు వచ్చాయి. ఐ బొమ్మ నిర్వాహకుడ్ని కూడా పట్టుకుని రిలీవ్ అవ్వాలనుకున్నా.. కుదరలేదు. అందుకే సినీ ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచి సమావేశం పెట్టారు. ఆ సమావేశం ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన హోంశాఖ చీఫ్ సెక్రటరీగా వెళ్లారు. అయితే అప్పట్లో పెట్టిన పోస్టుకు ఓ వ్యక్తి.. బాలకృష్ణను సమావేశానికి పిలవలేదు.. ఈ విషయాన్ని అసెంబ్లీలో లెవనెత్తుతాం అని కామెంట్ చేశాడు. దానికి సీవీ ఆనంద్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీ రిప్లై ఇచ్చారు.
సీవీ ఆనంద్ పై బ్లాస్ట్ అయిన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్
ఆ కామెంట్ ను బాలకృష్ణను కించ పర్చడానికి పెట్టారని సినీ ఫ్యాన్ వార్స్ లో పాల్గొనేవారికి తెలుస్తుంది. అందుకే ఒక్క ఎమోజీ బాలకృష్ణ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది. అసలు సీవీ ఆనంద్ ఆ.. కామెంట్ విషయంలో ఏం అర్థం చేసుకున్నారో కానీ ఆయన బాలకృష్ణను కించపరిచే ఉద్దేశం ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఎమోజీ ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ మిస్ ఫైర్ అయింది. వ్యతిరేకంగా చాలా కామెంట్లు వచ్చాయి. ఎవడో బాలకృష్ణ హేటర్.. కామెంట్ చేస్తే ఫ్యాన్ వార్ చేసుకున్నట్లుగా ఆయన ఎమోజీ పోస్టు చేయడం ఏమిటని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని సీవీ ఆనంద్ ఆ ఎమోజీ కామెంట్ ను డిలీట్ చేసుకున్నారు.
సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎప్పటికీ నిలిచి ఉంటుంది!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సామాన్యుల కంటే సెలబ్రిటీలకు ఇంకాఎక్కువ పదును. పెద్ద వాళ్లకు .. ఎక్కడ పట్టుకున్నా కోసుకుపోయే కత్తిలాంటిది. ఎందుకంటే వారు ఎలాంటి ఉద్దేశంతో పోస్ట్ లేదా కామెంట్ చేసినా దానిపై నెగెటివిటీ ప్రారంభించడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. ఆయన ఉద్దేశం కూడా ఎవరికీ అవసరం లేదు. వెంటనే వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఇప్పుడు అది సీవీ ఆనంద్ కు అర్థమై ఉంటుంది. కానీ ఇప్పటికే నష్టం జరిగిపోయింది. ఆయనకు నెగెటివ్ గా ఇక ఏమి వచ్చినా దాన్ని వైరల్ చేయడానికి ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అంటే ఒక్క ఎమోజీతో.. సోషల్ మీడియాలో వ్యతిరేకతను సీవీ ఆనంద్ పెంచుకున్నారన్నమాట.
నిజానికి సీవీ ఆనంద్ పైరసీ అంతు చూసేందుకు ప్లాన్ చేసిన ఆఫీసర్. ఆపరేషన్ మధ్యలో ఉన్నప్పుడు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆపరేషన్ కంప్లీట్ అయింది. అది తన క్రెడిట్ అని చెప్పుకోవడానికి ఆయన ఆ ట్వీట్ ను గుర్తు చేయాలనుకుని ఉంటారు. ఎవరైనా పనికి గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఇక్కడ తన క్రెడిటే అని గుర్తు చేయాలనుకున్నారు. కానీ అది రివర్స్ అయింది.
ఎమోజీపై బాలయ్యకు సీవీ ఆనంద్ క్షమాపణ !
తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్ .. బాలయ్యకు క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టుకు ఇచ్చిన ఎమోజీ వల్ల అపార్థం చోటు చేసుకుందని సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు సీవీఆనంద్ పైరసీపై హీరోలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బాలకృష్ణ హాజరు కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హాజరయ్యారు. బాలయ్యను పిలవలేదని .. అసెంబ్లీలో లేవనెత్తుతాం అని ఓ నెటిజన్ … బాలకృష్ణను అవమానించినట్లుగా కామెంట్ చేశారు. దానికి సీవీ ఆనంద్ ట్విట్టర్ ఖాతా నుంచి రిప్లై ఎమోజీ పోస్ట్ అయింది.
అది అనేక విమర్శలకు కారణం అయింది. బాలకృష్ణ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. సీవీ ఆనంద్ కు మద్దతుగా ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వివాదాన్ని పెద్దది చేశారు. దానిపై సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. తనుక సమయం లేకపోవడం వల్ల ట్విట్టర్ హ్లాండ్లర్ ను అపాయింట్ చేసుకున్నానని అతను ఆ ఎమోజీ పోస్టు చేశాడని తెలిపారు. విషయం తెలిశాక ఆ పోస్టు డిలీట్ చేయడంతో పాటు ట్విట్టర్ హ్యాండ్లర్ ను కూడా తొలగించి తర్వాత తన అనుమతితో మాత్రమే పోస్టులు ఉండేలా చూస్తున్నాన్నారు. బాలకృష్ణతో పాటు మిగతా హీరోలంతా తనకు స్నేహితులేనని స్పష్టం చేశారు. బాలయ్యను కించ పరిచే ఉద్దేశం లేదని అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతూ మెసెజ్ కూడా చేశానని తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయిందని అనుకోవచ్చు.
