నవదీప్, నందు, శివాజీ, బిందు మాధవి.. కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. మురళీకాంత్ దేవాసోత్ దర్శకుడు. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ‘చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద’ అనే డైలాగ్ ఈ సినిమా కంటెంట్ ఏమిటన్నది చెప్పకనే చెబుతోంది. శివాజీ నోటి నుంచి వచ్చిన కొన్ని పవర్ ఫుల్ డైలాగులు కూడా గుర్తు పెట్టుకొనేలా ఉన్నాయి.
‘నాలుగు పుస్తకాలు చదివి లోకమంతా తెలిసినోడి లెక్క మాట్లాడకు.. నీకు తెలియని లోకం ఇకోటి ఉంది ఈడ’ అనే డైలాగ్ కూడా బాగానే పేలింది. దీన్ని బట్టి.. ఈ కథ చావు చుట్టూ తిరగబోతోందన్న సంగతి అర్థమౌతోంది. సినిమా కంటెంట్ పై కూడా నవదీప్, శివాజీ చాలా నమ్మకంగా ఉన్నారు. శివాజీ ఇటీవల `కోర్ట్` సినిమాలో మంగపతిగా ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఆ తరవాత అంతటి పవర్ఫుల్ పాత్ర ఇదే అంటున్నారు శివాజీ. ఈ ట్రైలర్ ప్రముఖకథానాయకుడు అల్లు అర్జున్ ఇది వరకే చూశార్ట. చిత్రబృందాన్ని అభినందించార్ట. ”మా ట్రైలర్ బన్నీకి బాగా నచ్చింది. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను” అంటున్నాడు దర్శకుడు. ”ఓ సీరియస్ విషయాన్ని ఎంటర్టైన్ జోడించి చెప్పాం. ఈ మేళవింపు ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది” అని చిత్రబృందం చెబుతోంది. కుల వ్యవస్థని టచ్ చేస్తూ సాగే ఈ కథ చాలామందిలో మార్పు తీసుకొస్తుందని నిర్మాత అంటున్నారు. ఇంతమంది నటీనటులు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.