ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు కానీ అది దిగువ కోర్టులోనే వేస్తున్నారు. దిగువ కోర్టులో రెండు, మూడు సార్లు రిజెక్ట్ అయినా సరే కాస్త సమయం తీసుకుని అక్కడే పిటిషన్లు వేస్తున్నారు కానీ హైకోర్టుకు మాత్రం పోవడం లేదు. ఈ సీక్రెట్ ఏమిటో వైసీపీ లా టీంకూ అర్థం కావడం లేదు. సాధారణంగా కింది కోర్టు రిజెక్ట్ చేస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ నిందితులు జైల్లో ఉంటున్నారు కానీ హైకోర్టుకు పోవడం లేదు.
హైప్రోఫైల్ కేసుల్లో దిగువ కోర్టుల్లో బెయిల్ కష్టం
సాధారణంగా హై ప్రోఫైల్ కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు దిగువ కోర్టులు అంత ఎక్కువగా ఆసక్తి చూపించవు. ఆ స్థాయి కేసులు హైకోర్టు స్థాయిలోనే తేలుతాయి. అయితే అన్నీ బాగుంటే దిగువ కోర్టులోనే బెయిల్ వస్తుంది. కానీ ఎక్కువగా రాష్ట్ర వ్యాప్త సంచలన కేసులు .. హైకోర్టుల వరకూ వెళ్తాయి. అక్కడ హోరాహోరీగా జరిగే వాదనల తర్వాతే ఫలితం వస్తుంది. ఈ విషయం లిక్కర్ కేసు నిందితులకు .. వారి న్యాయపరమైన బృందానికి తెలియనిది కాదు. కానీ హైకోర్టుకు మాత్రం పోవడం లేదు.
పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కృతి
లిక్కర్ కేసులో నిందితులు కొంత మందికి దిగువకోర్టులో బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారికి బెయిల్ వచ్చింది. మొత్తం ఐదుగురికి బెయిల్ వచ్చింది. వీరందరి బెయిల్ ఆర్డర్లు ఇచ్చే క్రమంలో ఉన్న పరస్పర విరుద్ధమైన అంశాల కారణంగా సీఐడీ వీరి బెయిల్స్ రద్దు చేయాలని పిటిషన్ పెట్టుకుంది. ఆ తరవాత ఆ పిటిషన్లపై వచ్చిన ఆదేశాలు.. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను విచారించిన కోర్టు వాటిని తిరస్కరించింది. ఇతరులకు బెయిల్ ఇచ్చి తమకు ఇవ్వలేదని.. వెంటనే హైకోర్టుకు వెళ్లి వాదించుకునే అవకాశం ఉంది. కాన వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితుల లాయర్లు, లీగల్ టీం మాత్రం మళ్లీ మళ్లీ దిగువ కోర్టులోనే పిటిషన్లు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఒక్క లిక్కర్ కేసు నిందితులే కాదు..ఐపీఎస్ సంజయ్ కూడా !
లిక్కర్ కేసు నిందితులే బెయిల్ కోసం పై కోర్టుకు వెళ్లకపోవడం మాత్రమే కాదు. అవినీతి కేసులో అరెస్టు అయిన ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికి ఆయన బెయిల్ ను మూడు సార్లు దిగువ కోర్టు తిరస్కరించింది. 80 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. నిజానికి ఆయనపై ఉన్న ఆరోపణలకు.. 80 రోజులకుపైగా జైల్లో ఉండటం ఆయన లాయర్ల తప్పిదమే. దిగువ కోర్టులో తిరస్కరించినప్పుడు హైకోర్టుకు వెళ్లినట్లయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఆయన మళ్లీ మళ్లీ దిగువకోర్టులోనే పిటిషన్లు వేస్తున్నారు. నిరాశ ఎదురైనా ఆయన తగ్గడం లేదు.
లాయర్ నిరంజన్ రెడ్డి ఏం సలహాలిస్తున్నారో మరి ?
జైల్లో ఉన్న పర్వాలేదు కానీ.. హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవాలని అనుకోకపోవడం వెనుక వైసీపీ లీగల్ టీం వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ టీమ్ ను లీడ్ చేసే నిరంజన్ రెడ్డి ఈ మేరకు సలహా ఇచ్చి ఉంటారని అంటున్నారు. ఒక వేళ పైకోర్టుల్లో బెయిల్ రిజెక్ట్ అయితే చాలా కాలం జైల్లో ఉండాలని అందుకే.. కాస్త ఆలస్యమైనా దిగువ కోర్టుల్లోనే బెయిల్ తెచ్చుకుందామని ఆయన సలహా ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
