మహిళల సైకాలజీ తెలిసిన ఎవరూ వారితో కొన్ని కీలకమైన విషయాల్లో రిస్క్ తీసుకోరు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు మాత్రం సాహసం చేస్తూంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడుతున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నుంచే ప్రారంభించనున్నారు.
గతంలో బీఆర్ఎస్ కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. పెద్ద ఎత్తున వాటి కోసం నిధులు కేటాయించింది. కానీ మహిళలు ఆ చీరలపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. యాభై, వంద కూడా చేయని చీరలు పంచారని రోడ్లపై వేసి తగులబెట్టారు. చాలా చోట్ల చీరల్ని పాత దుస్తుల ఉపయోగానికి వాడుకున్నారు. నిజానికి అవి మంచివా .. కావా అన్నది ముఖ్యం కాదు. వారికి సెలక్ట్ చేసుకునే చాన్స్ లేదు. వారికి ఇచ్చింది తీసుకోవాలి. అది మహిళలను అసంతృప్తికి గురి చేస్తుంది.
అదే సమయంలో ఉచితంగా ఇచ్చే చీరలపై చిన్న చూపు ఉంటుంది. చీపుగా తయారు చేసి ఇస్తారని భావిస్తారు. నిరుపేదలు కూడా .. ఇలాంటి క్వాలిటీతో శాటిస్ ఫై కావడం కష్టంగా మారుతుంది. చీరల పంపిణీ వల్ల మహిళలలో.. బీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజీ రాలేదు. అయినా రేవంత్ ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నారు. కోటి మందికి చీరల పంపిణీ ఒకే సారి జరగడం లేదు. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయనున్నారు. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో చీరలు అందజేయనున్నారు. అది మార్చికి పూర్తవుతుంది. అంటే అందరికీ ఒకే సారి ఇవ్వలేకపోతున్నారు. ఇది కూడా ఇబ్బందికరమే.
రాజకీయ వ్యూహాల్లో భాగంగా మహిళలకు తాయిలాలు ఇచ్చే క్రమంలో.. వారి సైకాలజీని క్షుణ్ణంగా అధ్యనయనం చేసి అమలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారి అంచనాలను అందు కోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా చీరలు లాంటి విషయాల్లో మరింత వ్యూహాత్మకంగా ఉండాలి. లేకపోతే చీరలు ఇచ్చి మరీ విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ కు అదే పరిస్థితి ఎదురయింది. మరి రేవంత్ మహిళల అంచనాలను అందుకుంటారా?


