తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్ ఓటమి మరో చిచ్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయి ఘోర పరాజయం చవిచూశాడు. ఈ ఓటమి వెనుక పార్టీలోని అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కార్యకర్తలు మధ్య మాటల యుద్ధం, మత రాజకీయాలపై విమర్శలు పార్టీ శ్రేణుల్లో కలవరాన్ని రేపాయి. ఈటల ‘డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలి’ అని బండి సంజయ్‌కు సలహాలిస్తున్నారు. హిందూత్వాన్ని వదులుకుంటే..తాను లేనట్లేనని బండి సంజయ్ భావోద్వేగానికి గురవుతున్నారు.
జూబ్లిహిల్స్ పరాభవానికి కారణం ఎవరు?
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో భాగం అయిన జూబ్లిహిల్స్ లో ఓటమి పార్టీకి తీవ్ర షాక్‌గా మారింది. ఎన్నికల ప్రక్రియలోనే కాకుండా, అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నీ కిషన్ రెడ్డే బాధ్యత తీసుకున్నారు. అయితే ప్రచారంలో పెద్దగా ఎవరూ కనిపించలేదు. రాష్ట్ర నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల ప్రచారానికి రాలేదు. సమన్వయ లోపం ఓటమికి దారితీసిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఈ ఓటమి వెనుక బీజేపీలోని అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా నిలిచాయి. పార్టీలో ‘డివిజన్ పాలిటిక్స్’ జరుగుతున్నట్టు టాక్ నడుస్తోంది, ఇది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని మరింత కష్టతరం చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బీజేపీ పాలసీనే తప్పు పడుతున్న ఈటల
మత రాజకీయాలు తెలంగాణలో నడవవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. “మత రాజకీయాలు మంచివి కావు, అవి ఎక్కువ కాలం నిలబడలేవు. అదికూడా తెలంగాణలో అస్సలు నడవవు. డివిజన్ పాలిటిక్స్, మత రాజకీయాలు చేయడం నేతలు మానుకోవాలి” అని ఈటల స్పష్టం చేశారు. ఈటల వ్యాఖ్యలు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించినవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్ మత రాజకీయాలే చేశారు. అయితే ఎవరేం అన్నా తాను హిందూ సనాతన ధర్మ రక్షణ కోసమే పనిచేస్తానని.. హిందూత్వంను వదిలేస్తే తానులేనట్లేనని చెబుతున్నారు. ఇరువురికి వివాదాలున్నాయి. అందుకే ఇది పార్టీలో ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.
ఈ మాటల యుద్ధం బీజేపీని ఎక్కడికి తీసుకెళ్తుంది?
పార్టీలోని ఈ అంతర్గత విభేదాలు తెలంగాణలో బీజేపీ బలాన్ని మరింత బలహీనపరుస్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి అర్బన్ సీటులోనే డిపాజిట్ కోల్పోవడం, పార్టీ కార్యకర్తల్లో నిరాశను మరింత పెంచుతోంది. రామచంద్రరావును అధ్యక్షుడిగా పెట్టినా.. పెద్దగా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీకి బలహీన ప్రత్యర్థిగా మిగిలిపోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. పార్టీని ఏకతాటిపైకి ఉంచే నాయకత్వం కూడా లేకుండా పోయింది. పార్టీ ఐక్యత అనేది లేకుండా పోయింది. ఇలా ఎంత కాలమన్న ఆవేదన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.


