లిక్కర్ స్కాంలో కమిషన్లు కొట్టేసి సంపాదించిన ఆస్తులను సిట్ జప్తు చేయడంతో చెవిరెడ్డి కలత చెందారు. జైల్లో ఉన్న ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఆయన రాశారో.. ఆయన పేరుతో ఎవరైనా రాసి విడుదల చేశారో కానీ.. నీట్ గా టైప్ చేయించి లీక్ చేయించారు. అందులో ఆయన గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పుకున్నారు. తాను చేసిన ఘోరాలకే తనను ఈ స్థితిలో దేవుడు పెట్టాడని ఆయన అనుకోవడం లేదు.
తాను ఎప్పుడూ లిక్కర్ ముట్టలేదని.. లిక్కర్ వ్యాపారం చేయలేదని ఆయన ఎప్పుడైనా కోర్టుకు తరలించినప్పుడు అరచి, గీ పెట్టే ఆయన ఇప్పుడు అదే విషయాన్ని లేఖలో చెప్పారు. లిక్కర్ వ్యాపారం చేశారని సిట్ చెప్పలేదు. లిక్కర్ స్కాం డబ్బుల్ని ఆయనే మేనేజ్ చేశాడని సిట్ చెప్పింది. ఎన్నికల ఖర్చులకు తరలించారని చెప్పింది. అలా వచ్చిన డబ్బులతో ఆయన కొన్న ఆస్తుల్ని సీజ్ చేసింది.
కానీ ఆ ఆస్తులు తాను రియల్ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించినవని ఆయన చెబుతున్నారు. ఆస్తులు అమ్మడం, కొనడం ఆయన వ్యాపారమట. గతంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్టు చేసినప్పుడు తాను ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తానని అందుకే శ్రీలంక వెళ్తున్నానని వాదించారు. ఇప్పుడు తనది రియల్ ఎస్టేట్ వ్యాపారమంటున్నారు. దేవుడిపై ఒట్లు వేసుకుని ప్రజలకు ఏదో చెబుతామంటున్నారు. నిజం ఏమిటో సిట్ అధికారులు కోర్టులో పెడుతున్నారు. అదే చట్టబ్ధం. దేవుడిపై ఒట్లు వేసి తాను చెప్పేదే నిజం అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే దేవుడ్నే ముంచేసిన బ్యాచ్ లో మొదటి రకం అని ప్రజలకు తెలిసిపోయింది కదా !