ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. టైమింగ్ కూడా చాలా అవసరం. ఎప్పుడు ఎలాంటి కథలు చేయాలి, ఎలాంటి జోనర్లు ఎంచుకోవాలి అనే విషయంలో క్లారిటీ ఉండాలి. అప్ డేట్ అవుతుండాలి. కొంతమంది జోనర్లు మార్చినా, ట్రెండ్ కి తగ్గట్టుగా కథలు ఎంచుకొంటున్నా… పెద్దగా ఫలితాలు ఉండవు. అది వాళ్ల బ్యాడ్ లక్ అనుకోవాలి. అల్లరి నరేష్‌కు కూడా అలాంటి దురదృష్టమే వెంటాడుతోంది.
‘అల్లరి’ ట్యాగ్ లైన్ మొదట్లో నరేష్ కు బాగా కలిసొచ్చింది. కామెడీ చేసే హీరోలు తక్కువైపోవడంతో.. ఆ సెగ్మెంట్ లో సినిమాలు చేసి, ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగాడు. కానీ జబర్దస్త్ లాంటి టీవీషోలు బాగా క్లిక్ అయి, వినోదం అంతా ఇంటి పట్టునే రాబట్టుకొనే అవకాశం ఉండడంతో నరేష్ లాంటి హీరోలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్తగా నవ్వించడంలో విఫలం అవ్వడంతో వరుస ఫ్లాపులు పడ్డాయి. ‘మహర్షి’తో కొత్త లైన్ వెదుక్కొన్నాడు నరేష్. ఆ సినిమా బాగా ఆడింది. నరేష్‌కీ మంచి పేరు తీసుకొచ్చింది. అదే కోవలో ‘నా సామిరంగ’ సినిమా చేశాడు. కానీ ప్రతీసారీ అలాంటి పాత్రలే రావు కదా. కాబట్టి బండి స్లో అయ్యింది. ‘నాంది’తో కొత్త జోనర్ టచ్ చేశాడు. కాకపోతే అది కూడా ఎంతో కాలం సాగలేదు. సీరియస్ డ్రామాల్లో నరేష్‌ని చూడలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కామెడీకి రావాల్సిన అవసరం ఏర్పడింది.
నరేష్ నటించిన ’12 ఏ రైల్వే కాలనీ’ ఈ శుక్రవారమే వచ్చింది. ఈ సినిమాపై విడుదలకు ముందు ఎలాంటి బజ్ లేదు. సినిమాలో విషయమూ లేదు. థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకోవడం వరకూ నరేష్ కొత్తగా ఆలోచించాడు. కానీ ఆ కథలో లూప్ హోల్స్ కనిపెట్టలేకపోయాడు. జోనర్ మార్చడం కాదు.. జనాలకు నచ్చే కథలు ఎంచుకోవాలన్న విషయంలో నరేష్ ఇప్పటికీ తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. నరేష్ నుంచి రాబోయే ‘ఆల్కహాల్’ కూడా కొత్త టైపు కథే. కానీ ఆ కథ నరేష్‌కి ఎంత వరకూ సూట్ అవుతుందన్నది ఆ సినిమా వస్తే కానీ తెలీదు. ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా చేస్తున్నాడు నరేష్. ఆ సినిమాలో పాత నరేష్ కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే… ఈ వరుస ఫ్లాపులతో నరేష్ డైలామాలో పడడం సహజం. తనకు ఎలాంటి కథలు నప్పుతాయి? ఏ జోనర్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు మెచ్చుకొంటారు అనే విషయాల్లో తనలో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇలాంటి గందరగోళంలోనే హీరోలు తప్పులు చేస్తుంటారు. ఒక్క హిట్ పడితే కానీ క్లారిటీ ఉండదు. మరి నరేష్‌కు అలాంటి హిట్ ఎప్పుడు వస్తుందో..?