అమరావతి రైతుల సమస్యను పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్లకు అప్పగించారు. వారు ప్రతి రెండు వారాలకోసారి రైతులతో సమావేశమై.. సమస్య ల పరిష్కారం దిశగా తీసుకున్న చర్యలను అప్ డేట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి వారు సీఆర్డీఏ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు.
గతంలో పాయింట్ చేసిన సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి కార్యచరణ తీసుకున్నామో వివరించారు. ఒక్క సమస్య కూడా ఉండదని ఆరు నెలల్లో అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు రాజధాని విషయంలో మరింత భరోసా కల్పించేందుకు గెజిట్ జారీ చేసేందుకు పార్లమెంట్ లో చట్టం చేయబోతున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమయిందని తెలిపారు.
రైతులు లేవనెత్తిన కొన్ని అంశాలపై అప్పటికప్పుడు పరిష్కారం చూపించారు. అమరావతి జేఏసీ రైతులు ప్రధానంగా 14 సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వీటిలో కొన్ని పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. మరికొన్నింటిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతులు అత్యధికంగా సంతృప్తిగా ఉన్నారని..చాలా కొద్ది విషయాల్లోనే సమస్యలు ఉన్నాయని.. అవి వ్యక్తిగత, కుటుంబ సమస్యల వల్ల వస్తున్నాయని భావిస్తున్నారు. ఎలాంటి సమస్యలు అయినా ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తామని పెమ్మసాని హామీ ఇస్తున్నారు.