కుప్పం నియోజకవర్గాన్ని నారా భువనేశ్వరి కూడా ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా ఆమె కుప్పంలో పర్యటిస్తున్నారు. NTR ట్రస్ట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతూ, రైతులు, మహిళలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నవంబర్ 20న కుప్పంకు వచ్చిన భువనేశ్వరి నిరంతరంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను ముఖ్యమంత్రి భార్యగా కాకుండా, టీడీపీ కార్యకర్తగా వచ్చానని ప్రజలతో కలసిపోయారు. సమస్యలతో వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అప్పటికప్పుడు చేయగలిగిన సాయం చేశారు. కుప్పం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో సమావేశమైన భువనేశ్వరి, తన కాలేజ్ రోజుల జ్ఞాపకాలు పంచుకున్నారు. “సమరసింహారెడ్డి సినిమాలో ‘ఒక వైపు చూడు, రెండో వైపు చూడకు’ అనే డైలాగ్ లాగా, మీరు లక్ష్యంపై దృష్టి పెట్టండి” అని సలహా ఇచ్చారు. శాంతిపురం మండలంలో స్వయం సహాయక బృందాలతో సమావేశమై, మహిళల ఆర్థిక సాధికారత ఎంత అవసరమో చెప్పారు.
రామకుప్పం మండలంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను పరామర్శించారు. కొన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. భువనేశ్వరి 500కు పైగా కుటుంబాలతో మాట్లాడారు. కుప్పంలో రోడ్లు, నీటి సరఫరా, సోలార్ ప్యానెల్స్ అన్నీ పనులు జరుగుతున్నాయన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. పర్యటన సందర్భంగా బస్సులో ప్రయాణించారు. పాలారు నదిలో బోటులో తిరిగారు. ఇలా ప్రజలతో మమేకం కావడంతో టీడీపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం కనిపించింది.